
నేడు అక్షర తృతీయ. ఈరోజు బంగారం కొనుగోలు చేయడం శుభసూచమని అంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుందని ఎక్కువ మంది విశ్వసిస్తారు. అందుకే అక్షర తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేసే వారు ఎక్కువ మంది ఉంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర తృతీయ రోజు కూడా బంగారం కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారా? రారా? అన్నది మాత్రం సందేహంగానే ఉంది. ఎందుకంటే .. సెంటిమెంట్ కంటే సొమ్ములు ఎక్కువ ఖర్చు చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. ఇప్పటికే పెరిగిన బంగారం ధరలతో అమ్మకాలు పడిపోయాయి.
అనేక ఆఫర్లు…
నేడు అక్షర తృతీయ కావడంతో బంగారం దుకాణాలు అనేక ఆఫర్లు ప్రకటించాయి. ఎంత బంగారం కొంటే అంత బరువైన వెండిని ఇస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. వంద గ్రాముల బంగారం కొంటే వంద గ్రాముల వెండి ఉచితమని కొందరు, మరికొందరు నేరుగా బంగారం ధరపై గ్రాముకు వెయ్యి రూపాయలు ఆఫర్లు ప్రకటించాయి. కానీ బంగారం ధరలను చూసిన వారు కొంత వెనక్కు తగ్గే అవకాశముంది. ఎందుకంటే ఇంత ధరలు పోసి కొనుగోలు చేయడం అవసరమా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. గత కొద్ది రోజులుగా బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని, ఈరోజైనా అమ్మకాలు జరుగుతాయోమోనని ఎదురు చూస్తున్నామని జ్యుయలరీ వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు స్వల్పంగా…
బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగి అందరి ఆశలను తలకిందులు చేశాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారాన్ని కొనుగోలు చేయాలన్నా కొందరు వెనకడుగు వేస్తున్నారు. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 89,900 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 98,900 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర స్వల్పంగా తగ్గి 1,00,090 రూపాయలుగా ట్రెండ్ అవుతుంది.