
గేమ్ ఛేంజర్ ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. జీ 5 గేమ్ ఛేంజర్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఓటీటీ ఆడియన్స్ గేమ్ ఛేంజర్ చిత్రాన్ని చూస్తున్నారు. అయితే శాటిలైట్ ప్రీమియర్ కి అతి తక్కువ ఆదరణ లభించింది. జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గేమ్ ఛేంజర్ చిత్రాన్ని ప్రదర్శించారు. మంచి ప్రమోషన్స్ కూడా జీ తెలుగు నిర్వహించింది. దాంతో గేమ్ ఛేంజర్ కి చెప్పుకోదగ్గ టీఆర్పీ వస్తుందని అందరూ భావించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. గేమ్ ఛేంజర్ ఫస్ట్ టెలివిజన్ ప్రీమియర్ కి కేవలం 5.02 రేటింగ్ మాత్రమే వచ్చింది.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల చిత్రాలను కూడా టెలివిజన్ లో జనాలు చూడటం లేదు. వందల కోట్లు కొల్లగొట్టిన పుష్ప 2 టెలివిజన్ ప్రీమియర్ కి కేవలం 12.61 టీఆర్పీ రేటింగ్ మాత్రమే దక్కింది. ఆ సినిమాకు థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ తో పోల్చితే చాలా తక్కువ టీఆర్పీ వచ్చినట్లు లెక్క. థియేట్రికల్ రెస్పాన్స్ తో సంబంధం లేకుండా బుల్లితెర మీద సంచనాలు చేసిన చిత్రాలు ఉన్నాయి. అయితే గేమ్ ఛేంజర్ వంటి స్టార్ హీరో సినిమాకు పట్టుమని పది టీఆర్పీ రాకపోవడం ఊహించని పరిణామం.
శాటిలైట్ ఆడియన్స్ విపరీతంగా పడిపోయారని బడా చిత్రాలకు వస్తున్న టీఆర్పీ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక తెలుగులో అత్యధిక టీఆర్పీ రాబట్టిన చిత్రంగా అల వైకుంఠపురములో ఉంది. ఈ మూవీ ఫస్ట్ టెలివిజన్ ప్రీమియర్ కి 29.4 టీఆర్పీ రావడం విశేషం. గేమ్ ఛేంజర్ మూవీకి వచ్చిన టీఆర్పీ ఎవరూ ఊహించనిది. అంత తక్కువ రెస్పాన్స్ వస్తుందని ఎవరూ భావించి ఉండరు.