
Disha Patani : సోషల్ మీడియా లో నేడు ఉదయం హృదయాలు బరువెక్కే వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఉత్తర్ ప్రదేశ్ లోనే బరేలి అనే ప్రాంతంలో, ఒక ఇంటికి దగ్గర్లో ఒక చిన్నారి ఏడుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఆ సమయం లోనే అటు వైపు ప్రముఖ హీరోయిన్ దిశా పటాని(Disha Patani) సోదరి కుష్బూ(Kushboo Patani) మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించింది. చిన్నారి ఏడుపులు విన్న కుష్బూ వెంటనే అక్కడికి వెళ్ళింది. మట్టిలో పడిపోయి వెక్కిళ్లు పెట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని ఎత్తుకొని వెళ్ళింది. ఇంత చిన్న బిడ్డని ఇక్కడ వదిలి వెళ్లిపోయిన తల్లదండ్రులపై ఆమె తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంత పసి బిడ్డని అలా వదిలేసి వెళ్లిపోవడానికి మనసు ఎలా వచ్చిందో, ఎన్ని రోజుల నుండి ఆ బిడ్డ అక్కడే ఒంటరిగా ఉంటూ, అన్నం నీళ్లు లేకుండా గడిపిందో పాపం. పోషించే స్తొమత లేనప్పుడు ఎందుకు కనడం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు.
మరోపక్క మానవత్వం చూపించి ఆ పసి బిడ్డని రక్షించిన దిశా పటాని సోదరి కుష్బూ పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవత్వం లేకుండా పైశాచికంగా అలాంటి చిన్నారులను విసిరేసి వెళ్లిపోయే మనుషులు ఉన్న ఈ కాలంలో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా, చిన్నారి ఏడుపులు తట్టుకోలేక తన వెంట తీసుకెళ్లిన కుష్బూ లాంటి గొప్ప మనసు ఉన్నవాళ్ళు కూడా మన సమాజం లో ఉన్నారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దిశా పటాని బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు లో ఈమె లోఫర్, కల్కి చిత్రాల ద్వారా మన ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఆమె సోదరి కుష్బూ పటాని కి 34 ఏళ్ళ వయస్సు. ఈమె మన ఇండియన్ ఆర్మీ లో ఆఫీసర్ గా పని చేసింది.
ఇండియన్ ఆర్మీ లో మేజర్ స్థాయి ర్యాంక్ కి ఎదిగి దేశానికీ ఎన్నో అద్భుతమైన సేవలు అందించిన కుష్బూ పటాని ఈమధ్యనే రిటైర్మెంట్ ని ప్రకటించింది. రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఫిట్నెస్ కోచ్ గా మారి, ఒక వెల్నెస్ సెంటర్ ని నడుపుతుంది. సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే కుష్బూ పటాని, అభిమానులతో నిత్యం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. చూసేందుకు హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోయిని అందం ఆమె సొంతం. తన చెల్లి దిశా పటాని తో కలిసి ఎన్నో ఫోటోలు, రీల్స్ కూడా చేసింది. ఇండియన్ ఆర్మీ లో పని చేసిన అమ్మాయి కాబట్టే సమాజం పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరిస్తోంది అంటూ సోషల్ మీడియా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే దిశా పటాని కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. బహుశా వాళ్ళ అక్క గారి నుండే ఆమెకు ఇది అలవాటు అయ్యుండొచ్చు.