
ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజులు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉదయం వేళ ఎండలు, సాయంత్రం వేళ వర్షం కురుస్తూ భిన్నమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడతయాని తెలిపింది. నిన్న విజయవాడను వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అధికారులు అప్రమత్తమై కొన్నిచోట్ల సహాయక చర్యలు కూడా చేపట్టారు. ఈరోజు కూడా భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాలకు రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో వర్షాలు…
అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడతాయని తెలిపింది. అంటే ఉత్తారంధ్రలోని సిక్కోలు నుంచి రాయలసీమలోని తిరుపతి వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. అలాగే మిగిలిన జిల్లాల్లో నలభై మూడు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. పిడుగులు పడే ప్రాంతాల్లో రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
వేడిగాలులు ఈ ప్రాంతంలో…
మరోవైపు తెలంగాణలో మాత్రం వడగాలులు బలంగా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పదమూడు జిల్లాల్లో హీట్ వేవ్స్ ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. వడగాలుల కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రజలు వీలయినంత వరకూ బయటకు రాకుండా ఉండటమేమంచిదని సూచించింది. మరికొన్న చోట్ల తేలికపాటి, మోస్తరు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.