
ఉగ్రవాదుల అంతానికే ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించామని త్రివిధ దళాల డీజీఎంవోలు తెలిపారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. త్రివిధ దళాల డీజీఎంవోలు రాజీవ్ ఘాయ్ (ఆర్మీ), ఏకే భారతి (ఎయిర్ ఫోర్స్), ఏఎన్ ప్రమోద్ (నేవీ) లు మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ తో తాము ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడిచేశామని తెలిపారు. తొమ్మిది ప్రాంతాల్లో భారత్ ఆర్మీ దాడులు జరిపిందన్నారు. 9 ఉగ్రవాదుల స్ధావరాలను నేలమట్టం చేయగలిగామని చెప్పారు. ఈదాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని తెలిపారు. ఉగ్రవాదం అంతానికే ఆపరేషన్ సిందూర్ ను నిర్వహించామని చెప్పారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హేడ్లీ వంటి ఉగ్రావాదులు శిక్షణ పొందిన స్థావరాలను కూడా ధ్వంసం చేశామని తెలిపారు.
పాక్ మాత్రం…
కానీ పాక్ మాత్రం భారత్ లోని గురుద్వారాలు, ఆలయాలపై దాడికి దిగి మత ఘర్షణలు రేకిత్తించడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఉగ్రవాదులకు సరైన జవాబు చెప్పాలన్నదే ఆపరేషన్ సిందూర్ లక్ష్యమని వారు వివరించారు. ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన దాడులకు సంబంధించిన వీడియోలను కూడా తాము విడుదల చేశామని చెప్పారు. పహాల్గామ్ దాడిలో చనిపోయిన వారిని చూసి దేశమంతా ఆవేదన చెందిందని అన్నారు. వారి కుటుంబ సభ్యుల ఆవేదన చూసి దేశమంతా చలించిపోయిందన్నారు. హహాల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు మరణించారని చెప్పారు. అందుకు ప్రతి చర్యగానే తాము ఆపరేషన్ సిందూరను ప్రారంభించామని చెప్పారు. ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లు కూడా మరణించారని వారు తెలిపారు.
ఉగ్రవాద శిబిరాలను…
పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగిందని వారు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతోనే దాడులు జరిపి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంలో విజయవంతమయ్యామని చెప్పారు. సరిహద్దుకు దగ్గరలో ఉన్న మురిద్కేపై ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తాము తొలి దాడి జరిపామని చెప్పారు. డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ భూభాగంపై పాక్ ప్రయోగించిందని, అయితే వాటికి సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని చెప్పారు. పాక్ వరస దాడులతో మరింతగా రెచ్చగొట్టే చర్యలకు దిగిందని చెప్పారు. టార్గెట్ ను పక్కాగా ప్లాన్ చేసి అమలు చేసి సక్సెస్ అయ్యామని త్రివిధ దళాల డీజీఎంఓలు తెలిపారు. నిన్న కాల్పుల విరమణకు అంగీకరించిందని, అయితే కొద్ది గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. ఈరోజు కూడా సమాచారం పంపామని, కాల్పులను పాక్ కొనసాగిస్తే కౌంటర్ యాక్షన్ కు దిగుతామని హెచ్చరికలు పంపామని చెప్పారు. భారత ఆర్మీకి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, పాక్ కాల్పులకు దిగితే వెంటనే యాక్షన్ లోకి దిగాలని ఆదేశాలిచ్చామని చెప్పారు.