
భారత్ ఉగ్రవాదులపై పోరాటం చేస్తుందని త్రివిధ దళాలకు చెందిన డీజీఎంఓలు తెలిపారు. కానీ పాకిస్తాన్ మాత్రం తమపై దాడి చేస్తుందని భావిస్తుందని అన్నారు. ఉగ్రవాదానికి పాక్ అండగా నిలిచిందని చెప్పారు. త్రివిధ దళాల డీజీఎంవోలు రాజీవ్ ఘాయ్ (ఆర్మీ), ఏకే భారతి (ఎయిర్ ఫోర్స్), ఏఎన్ ప్రమోద్ (నేవీ) లు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉగ్రవాదులు వారికి సాయం చేసే వారిని అంతం చేసే లక్ష్యంగానే ఆపరేషన్ సిందూర్ అని తెలిపారు. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో మనం పాక్ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకోగలిగామని చెప్పారు. దేశీయంగా తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తోనే తాము అడ్డుకున్నామని చెప్పారు. ఆకాశ్ డిఫెన్స్ వ్యవస్థతతో వారిని ధీటుగా ఎదుర్కొన్నామని చెప్పారు.
వారు ప్రయోగించిన డ్రోన్లు…
శత్రువు ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు, ఎయిర్ క్రాఫ్ట్ లను నాశనం చేయగలిగామని చెప్పారు. పాకిస్తాన్ లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై మనం చేసిన దాడితో రన్ వేకు తీవ్ర నష్టం జరిగిందని వారు వివరించారు. చైనా తయారు చేసిన పీఎల్ 15 మిసైళ్లతో భారత్ పై పాకిస్తాన్ దాడికి యత్నించిందని చెప్పారు. పాకిస్తాన్ వివిధ రకాల డ్రోన్లను భారత్ పై వినియోగించిందని తెలిపారు. 9,10 తేదీల్లో పాకిస్తాన్ భారత్ మిలటరీ స్థావరాలపై దాడులకు యత్నించిందని, దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగామని చెప్పారు. సైనికులనే కాకుండా భక్తులను, యాత్రికులను పాక్ టార్గెట్ చేస్తుందని తెలిపారు.
వ్యూహాన్ని మార్చుకుని…
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా వ్యూహాన్ని మార్చుకుంటున్నారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ నిర్వహించినవిధానం పట్ల ప్రపంచ దేశాలన్నీ భారత్ కు అండగా నిలిచాయని వారు వివరించారు. దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారని అన్నారు. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి అండగా నిలిచిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమయిందని చెప్పారు. పాక్ లోనూ, పీవోకేలోనూ ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయగలిగామని చెప్పారు. అనేక పాక్ డ్రోన్లు, మిసైళ్లనుతిప్పి కొట్టగలిగామని చెప్పారు. పాక్ భూభాగంలో జరిగిన నష్టానికి బాధ్యత పాక్ ఆర్మీదే బాధ్యత అని వారు అన్నారు. ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.