
ఇండియా – పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాక్ వాటికి తూట్లు పొడుస్తూనే ఉంది. భారత్ చేస్తున్న హెచ్చరికలు పాక్ పెడచెవినపెడుతుంది. తాజాగా సోమవారం కూడా డ్రోన్లతో సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ దాడులకు దిగిందని భారత సైన్యం తెిపింది. జమ్మూకాశ్మీర్ లోని సాంబ సెక్టార్ లో డ్రోన్లు కనిపించాయని చెబుతున్నారు. వీటిని భారత్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందని కూడా చెబుతున్నారు. నిన్న పాక్ – ఇండియా దేశాలకు చెందని డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినప్పటికీ సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు దిగడం ఇప్పడు చర్చనీయాంశమైంది.
తిప్పికొట్టగలిగినా…
సోమవారం రాత్రి డ్రోన్లతో జరిపిన దాడులను భారత్ ఆర్మీ తిప్పికొట్టగలిగినా అసలు కాల్పుల విరమణను ఎందుకు పాటించలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. భారత్ ను తేలిగ్గా పాక్ తీసుకుందా? లేక పాక్ ప్రభుత్వం ఆదేశాలను ఆ దేశ సైన్యం వినడం లేదా? అన్న అభిప్రాయం అంతర్జాతీయ సమాజం నుంచి వ్యక్తమవుతుంది. సాంబా సెక్టార్ లో పెద్ద శబ్దాలు వచ్చినట్లున్యూస్ ఏజెన్సీలు కూడా తెలిపాయి. రాత్రి పది గంటల సమయంలో డ్రోన్లు కనిపించాయని భారత్ ఆర్మీ కూడా ధృవీకరించింది. దీంతో పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదని మరోసారి రుజువు కావడంతో భారత్ ఆర్మీ నిరంతరం పహారా కాస్తుంది. సరిహద్దుల్లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది.
నేడు కీలక సమావేశం…
అయితే భారత్ సరిహద్దు ప్రాంతాల్లో ఇండిగో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది. జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, లెహ్, శ్రీనగర్, రాజ్ కోట్ ప్రాంతాలకు ఈరోజు తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సోమవారం రాత్రి పాక్ కాల్పులకు దిగడంతో దానికి దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ కూడా సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు అత్యవసర సమావేశం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. త్రివిధ దళాధిపతులు భేటీ అయి ప్రధాని మోదీతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలకు దిగే అవకాశముందని అంటున్నారు.