
ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందా? తాము ఒకటి ఆశిస్తే షర్మిల మరొకటి చేస్తున్నారని ఆవేదనలో ఉందా? అంటే సీనియర్ నాయకుడు ఒకరు ఇదే విషయం చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్లో పార్టీని తిరిగి నిలబెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు అవకాశం ఇచ్చిందన్నారు. తద్వారా పోయిన ఓటు బ్యాంకు ను తిరిగి సంపాదించుకోవడంతో పాటు రాజకీయంగా బలోపేతం కావాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశ మనీ ఆయన చెప్పుకొచ్చారు.
అయితే రాష్ట్రంలో అధిష్టానం ఆశించిన దానికంటే భిన్నంగా షర్మిల వ్యవహరిస్తుండడం, పార్టీకి నష్టం చేకూరుస్తోందని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. వాస్తవానికి షర్మి లను పార్టీలోకి తీసుకోవడం పట్ల తనకు వ్యతిరేకత లేదని, అయితే ఆమెను నేరుగా రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకోకుండా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించి ఉంటే బాగుండేదన్నారు. ఇదే విషయాన్ని తమ గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెప్పామని సదరు నేత వెల్లడించారు.
అధిష్టానం తమ మాటను పట్టించుకోకుండా నేరుగా ఆమెకు రాష్ట్ర పార్టీ వర్గాలు అప్పగించారని దీంతో వ్యక్తిగత అజెండాను అమలు చేస్తూ షర్మిల పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో పార్టీ పరంగా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. కానీ ఆ దిశగా షర్మిల ప్రయత్నాలు చేయకపోగా మరింత నష్టం చేకూరుస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఈ సీనియర్ నాయకుడు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
షర్మిల విషయంపై పార్టీ అధిష్టానం కూడా అంతర్మథనం చెందుతున్నట్టు చెప్పారు. అయితే.. ఇప్పుడు ఆమెను పక్కకు తప్పించే అవకాశం కూడా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు షర్మిలను పక్కనపెడితే వైఎస్ కుటుంబానికి గతంలో జరిగిన అన్యాయాన్ని ఆమె మళ్లీ తెర మీదగా తీసుకొచ్చి పార్టీని కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎలా చూసుకున్నా షర్మిలను ఎంపిక చేసే ముందే ఆలోచించుకుని ఉంటే బాగుండేది అన్నది ఆయన అభిప్రాయం. ఏదేమైనా షర్మిల విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని మెజారిటీ నాయకుల అభిప్రాయపడుతున్నట్లు కూడా ఆయన చెప్పుకు రావడం విశేషం. మరి ఏం జరుగుతుందో చూడాలి.