
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. మరో రెండు నెలల్లో మూడు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీే కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానుంది. ఏడాది పూర్తియిన సందర్భంగా పేదలకు ఇళ్లలో పండగలా జరపాలని, నూతన ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇంత పెద్ద స్థాయిలో గృహప్రవేశాలను నిర్వహించి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పేదలకు తీపి కబురు అందించాలని చంద్రబాబు భావిస్తున్నారు. . ఈ ఏడాది జూన్ 12న ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు సంవత్సరం పూర్తి కానున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం బిగ్ గుడ్ న్యూస్ ను అందించాలని నిర్ణయించింది.
కీలక ఆదేశాలు..
ఇప్పటికే పేదల ఇళ్ల నిర్మాణంపై చర్యలు వేగవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష డెబ్భయి వేల ఇళ్ల నిర్మాణంపూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 1.30 లక్షల ఇళ్లు పూర్తిచేయాలని, మరో మూడు నెలలు సమయం ఉండటంతో వాటిని వెంటనే పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది. ఇంకో 60 వేల ఇళ్లు తుది దశలో ఉన్నాయని, మిగిలిన ఇళ్ల నిర్మాణాలను గడువులోగా పూర్తిచేయడానికి ప్రభుత్వం అదనపు సాయం అందించడానికి రెడీ అవుతుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం సాయంతో నిధులను సమీకరించి మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
త్వరగా పూర్తి చేసి…
అయితే చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఎప్పటికప్పుడు సమీక్షించాలని చంద్రబాబు విదేశాలకు వెళుతూ కూడాహౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ను ఆదేశించినట్లు తెలిసింది. ఆయన నిత్యం జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులుతో సమీక్షలు నిర్వహిస్తూ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు. నిర్మాణ పురోగతిని అనుసరించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించడమే కాకుండా అవసరమైన నిధులను, సామగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్లకు చెబుతున్నారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులను కూడా భాగస్వామ్యులను చేసి పనులను మరింత వేగవంతంగా చేయాలని చంద్రాబాబు ఆదేశించినట్లు తెలిసింది
పేదల సంక్షేమం కూడా…
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమాన్ని జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని నిర్ణయించారు. పేదల కోసం ఈ ప్రభుత్వం పనులు చేస్తుందని, ఒకవైపు అమరావతి రాజధాని పనులు పూర్తి చేస్తూనే, మరొక వైపు పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులుపెట్టిస్తూ మరో వైపు పేదలకు పక్కా ఇళ్లను అందచేస్తే కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఇమేజ్ మరింత పెరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. జూన్ పన్నెండో తేదీన చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ ఈ గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని వారికి విలువైన బహుమతిని అందించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. దీంతో కూటమి సర్కార్ పేదల పక్షపాతి అని ముద్ర పడేలా, ఒకే విడత మూడు లక్షల ఇళ్లను గృహప్రవేశాలు చేసి గుమ్మడి కాయ కొడితే ఇక వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో మూడు లక్షల ఇళ్లంటే కనీసం ఆరు లక్షల ఓట్లు రాజకీయంగా కూటమి ఖాతాలో పడినట్లే.