
Bonalu: బోనాలకు సిద్ధమవుతోన్న భాగ్య నగరం.. నెల రోజుల పాటు దూమ్ దామ్ జాతర
Bonalu: తెలంగాణలో ఆషాఢ మాసం వస్తే చాలు… భక్తిశ్రద్ధలతో నిండిన బోనాల ఉత్సవాల జ్ఞాపకమే ముందు వస్తుంది. అమ్మవారిని ఇంటి బిడ్డలా భావించి, అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకురావడం, అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి బోనం సమర్పించడం ఈ పండుగలో ప్రధాన విశేషం. భక్తులు సారెతో అమ్మవారిని తిరిగి అత్తింటికి పంపించే ఈ సంప్రదాయం గొప్ప కుటుంబ బంధాన్ని గుర్తు చేస్తుంది.
ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా… వర్షాకాలం ప్రారంభానికి సంకేతంగా, పంటలు పండాలని కోరుకునే పండుగగా కూడా మన తెలంగాణ ప్రజలు దీనిని జరుపుకుంటారు.
ఈ సంవత్సరం వేడుకల తేదీలు
ఈ ఏడాది బోనాల జాతర జూన్ 26న గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమవుతుంది. జూన్ 29న విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించనున్నారు. ఇక జూలై 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరగనుంది.
జూలై 20న హైదరాబాద్లో ప్రసిద్ధి గాంచిన లాల్ దర్వాజ బోనాల జాతర జరుగనుంది. తర్వాత రోజు, జూలై 21న ఘట్టాల ఊరేగింపు నిర్వహిస్తారు. చివరగా, జూలై 24న బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.
భక్తుల రద్దీ, అధికారుల ఏర్పాట్లు
ఒక్క నెల రోజుల పాటు జరిగే ఈ వేడుకల సమయంలో లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తరలివస్తుంటారు. దీంతో అధికారులు ముందస్తుగానే ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈసారి మరింత భారీగా భక్తుల రాక కనిపించనుంది.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే పండుగ
బోనాలు పండుగ తెలంగాణలో అమ్మవారిపై భక్తి, సంప్రదాయం, కుటుంబ అనుబంధం, ప్రకృతితో సామరస్యాన్ని చూపించే ఒక అద్భుతమైన ఉదాహరణ. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఈ పండుగకు ఉన్న ప్రాధాన్యత వల్లే ఇది జాతీయ స్థాయిలోను గుర్తింపు పొందింది.