
Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్..నేడు దంచికొట్టనున్న వర్షాలు
Weather Update: తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. నైరుతీ రుతుపవనాలు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని..మూడు రోజుల్లో ఇవి మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటాయని తెలిపింది. ప్రస్తుతం ఇవి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణాది రాష్ట్రాల కింద ఉండే ప్రదేశానికి చేరుకుంటున్నాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి రాయలసీమ వరకు ఒక ద్రోణి ఉంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోందని..దీని వల్ల సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తు నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ప్రస్తుతానికి ఇది కోస్తాకి దగ్గరలో ఉంది. దీంతో బంగాళాఖాతంలో గాలివేగం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం గంటకు 28కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ అల్పపీడనం క్రమంగా నెల్లూరుకు దగ్గరలోకి వచ్చి అక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు 20వ తేదీన కూడా అక్కడక్కడే తిరుగుతూ 21న రాజమహేంద్రవరం, విశాఖ వైపుగా వెళ్లేలా ఉంది. ఇదే శక్తి తుపాన్ గా మారుతుందని అంచనా వేస్తోంది ఐఎండీ. భారత వాతావరణశాఖ ప్రకారం మరో ఏడు రోజులు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది. నేడు సోమవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రోజంతా మేఘాలు ఉంటాయి. సాయంత్రం 4 తర్వాత ఉత్తర, దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాత్రి 8 తర్వాత గద్వాల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. రాత్రి 12 తర్వాత ఖమ్మం, రామగుండం, జగిత్యాలలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.