
Ashok gajapathi Raju : ఈసారి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో.. ఆ పార్టీకి చెందిన నేతకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పేరు ఖరారు చేస్తూ చంద్రబాబు సైతం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలోనే ప్రకటన ఉంటుందని బలంగా ప్రచారం జరుగుతోంది.
Ashok gajapathi Raju : టిడిపికి గవర్నర్( governor) పోస్ట్ కేటాయిస్తున్నారా? ఈ మేరకు కేంద్రం సిద్ధంగా ఉందా? చంద్రబాబు సైతం పేరు ఖరారు చేసి ఢిల్లీకి పంపించారా? ఇక ప్రకటనే తరువాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో రెండుసార్లు నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. కానీ ఎన్నడు ఏపీకి గవర్నర్ల విషయంలో ప్రాధాన్యత దక్కలేదు. 2019లో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో బిజెపి సీనియర్ నేత కంభంపాటి హరిబాబుకు గవర్నర్ ఛాన్స్ దక్కింది. అయితే అది కూడా బిజెపి కోటాలోనే. కానీ ఈసారి కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడంతో.. ఆ పార్టీకి చెందిన నేతకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పేరు ఖరారు చేస్తూ చంద్రబాబు సైతం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలోనే ప్రకటన ఉంటుందని బలంగా ప్రచారం జరుగుతోంది.
* అశోక్ గజపతిరాజు పేరు ఖరారు..
అయితే గవర్నర్ పోస్ట్ కు ప్రముఖంగా అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ) పేరు వినిపిస్తోంది. టిడిపి తో పాటు చంద్రబాబు తో ఆయనకు సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు అశోక్ గజపతిరాజు. అందుకే ఆయనకు సమున్నత స్థానం కల్పించాలని చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆ సమయం ఆసన్నమైంది. త్వరలో అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు యనమల రామకృష్ణుడి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే యనమలకు రాజ్యసభ కు పంపించి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పోస్ట్ ఇస్తారని తెలుస్తోంది.
* సుదీర్ఘ నేపథ్యం..
విజయనగరం జిల్లా( Vijayanagaram district) అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అశోక్ గజపతిరాజు. విజయనగరం సంస్థానాధిశుడిగా ఉత్తరాంధ్ర ప్రజల నుంచి మన్ననలు అందుకున్నారు అశోక్. 1978లో తొలిసారిగా జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు చంద్రబాబు. ఈ విధంగా చంద్రబాబుకు సమకాలీకులు అశోక్. కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం కలిగిన నేతగా గుర్తింపు పొందిన అశోక్.. ఎన్టీఆర్ పిలుపుమేరకు ఆ పార్టీలో చేరారు. టిడిపి వ్యవస్థాపక సభ్యుడిగా మారారు. 1983 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్.. ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అయ్యారు. 2014లో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యారు.
* అప్పట్లోనే గుర్తించిన మోడీ..
2014లో మోడీ( Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. ఆ సమయంలో కేంద్ర మంత్రివర్గంలో సైతం చేరింది. పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజుకు అవకాశం దక్కింది. ఆ సమయంలో ప్రధాని మోడీ సైతం అశోక్ విషయంలో ప్రత్యేకమైన అభిమానాన్ని చూపారు. నిజాయితీతో పాటు నిరాడంబరతను చూశారు. అందుకే టిడిపి తరఫున అశోక్ గజపతిరాజు పేరు సిఫారసు చేసిన వెంటనే ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలోనే అశోక్ గజపతిరాజు గవర్నర్ గా నియామకానికి సంబంధించి ప్రకటన రానున్నట్లు సమాచారం.