
నిధులు..నదులు ఆంధ్రకే అన్నట్లుగా బీజేపీ తీరు
నిధులు, నదులు రెండు ఆంధ్రకే అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉందని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేస్తున్న బీజేపీ బనకచర్లకు సహకరిస్తూ మరో ద్రోహం చేస్తుందని మండిపడ్డారు. 8మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో తెలంగాణకు అన్యాయం జరిగినా మాట్లాడటం లేదన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి నోరు మెదపడం లేదని మండిపడ్డారు. 2టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారని..మరి నేడు 200టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడని గుర్తు చేశారు. కేంద్రంలో పరపతితో చంద్రబాబుపై నుండి కాకుండా పోలవరం నుండి నీళ్ళు మళ్ళించి, కేంద్రం నుండి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నారన్నారు. అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదని విమర్శించారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండని..నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకావాలి అని డిమాండ్ చేస్తున్నామని హరీష్ రావు స్పష్టం చేశారు.
అడ్డుకోకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు
రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్ధని..సీఎం రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలని..బనకచర్లను అడ్డుకోకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావని హరీష్ రావు హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడి..చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బనకచర్లను అడ్డుకునేందుకు ఏ రకమైన పోరాటంలోనైనా బీఆర్ఎస్ కలిసి వస్తుందని..అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తామన్నారు. బనకచర్లకు వ్యతిరేకంగా మీరు ముందుకు రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతుందని హరీష్ రావు ప్రకటించారు.