
* వరదలతో విలవిల
గత ఏడాది జూన్ లో కూటమి ప్రభుత్వం( Alliance government ) అధికారంలోకి వచ్చింది. సెప్టెంబర్లో విజయవాడను బుడమేరు ముంచేసింది. దీంతో వేలాది కుటుంబాలు వరదల్లో చిక్కుకున్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులు అయ్యారు. కనీసం ఆహారం కూడా వారికి దొరకని పరిస్థితి. అటువంటి సమయంలో సీఎం చంద్రబాబు నేనున్నాను అంటూ బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. రోజుల తరబడి విజయవాడలోనే మకాం వేసి బాధితులకు స్వయంగా వరద నీటిలోనే వెళ్లి పరామర్శించారు. వారికి అన్ని విధాల సాయం చేశారు. రాత్రికి రాత్రి వరద బాధితులను ఆదుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు వర్కౌట్ అయ్యాయి. అయితే ఈ కష్టం నుంచి బయటపడే క్రమంలో.. ఏలూరులోని ఎర్ర కాలువ పొంగింది. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో ఇబ్బందులు తప్పలేదు.
* ఫార్మా కంపెనీలో ప్రమాదాలు..
అటు తర్వాత ఫార్మా కంపెనీల్లో( Pharma Companies) వరుస ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలో ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఉద్యోగులతో పాటు కార్మికులు చనిపోయారు. అటు తర్వాత కాకినాడలోని పరిశ్రమలో సైతం ప్రమాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాల పరామర్శ, వారికి పరిహారం అందించడంలో ప్రభుత్వం ముందంజలో నిలిచింది. క్యాబినెట్ మంత్రులు సైతం నేరుగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ప్రభుత్వపరంగా అండగా నిలిచారు.
* తిరుపతిలో తొక్కిసలాట
ఈ ఏడాది జనవరిలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల పంపిణీలో అపశృతి జరిగింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోయారు. ఇది పెను వివాదానికి దారితీసింది. మృతుల కుటుంబాలకు టీటీడీతో పాటు ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం కూడా అందించింది. అంతకుముందు టీటీడీ లడ్డు ప్రసాదం వివాదం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా పేలుడు కారణంగా 8 మంది చనిపోయారు. తాజాగా సింహాచలంలో జరిగిన ఘటనలో భక్తులు మరణించారు. ఇప్పుడు వారికి ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. ప్రభుత్వం పాలనలో మునిగి తేలుతున్న తరుణంలో ఇలా ప్రమాదాలు, వివాదాలు, విపత్తులు.. తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. మరి వీటన్నింటినీ తట్టుకొని కూటమి ప్రభుత్వం ఎలా నిలబడుతుందో చూడాలి.