
Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మే 2న కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన సరే అన్నారు. ప్రధాని ఏపీ పర్యటనకు సంబంధించి పీఎంవో షెడ్యూల్ ఖరారు చేసింది. రాజధాని పునర్నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పది నెలలుగా నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది. అది కొలిక్కి వచ్చిన తరువాత ఇప్పుడు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. 2028 నాటికి రాజధాని నిర్మాణ పనులు పూర్తిచేసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి భారీగా జన సమీకరణ చేయాలని డిసైడ్ అయింది. దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది.
* ప్రముఖుల హాజరు
అయితే ఈసారి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు( central ministers) వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రి సైతం హాజరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తారా? రారా? అన్నది చూడాలి. 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో తెలంగాణ సీఎం గా కెసిఆర్ ఉండేవారు. దాయాది రాష్ట్రం ఆహ్వానం మేరకు ఆయన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం ఉండే అవకాశం ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ఎన్డీఏ పక్ష నేతలు రావడంతో.. రేవంత్ రెడ్డి హాజరయ్యే ఛాన్స్ చాలా తక్కువ అని తెలుస్తోంది.
* జగన్ హాజరుపై సందిగ్ధత
మరోవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి( Jagan Mohan Reddy) ప్రత్యేక ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానించారు. కానీ ఆయన హాజరు కాలేదు. అయితే ఇప్పుడు కూడా గైర్హాజరయ్యే అవకాశం ఉంది. గత ఐదేళ్లుగా అమరావతిని నిర్వీర్యం చేశారన్న విమర్శ ఆయనపై ఉంది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని పూర్తిగా అణచివేశారు. తెరపైకి మూడు రాజధానులను తెచ్చారు. దీనిని ఏపీ ప్రజలు ఆహ్వానించలేదు. మొన్నటి ఎన్నికల్లో తిరస్కరించారు కూడా. అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు హాజరైతే అది అవమానకరంగా మారే అవకాశం ఉంది. అందుకే ఆహ్వానం అందినా జగన్మోహన్ రెడ్డి హాజరు కారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఓ మాజీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని మంత్రుల కమిటీ తెలిపింది.
* మంత్రుల ఉప సంఘం ఏర్పాటు..
మరోవైపు ప్రధాని మోదీ( Prime Minister Modi) అమరావతి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రుల కమిటీని నియమించారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సిఎస్ విజయానంద్, నోడల్ అధికారి వీర పాండ్యన్ ఉన్నారు. ఇప్పటికే ఈ బృందం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏర్పాట్లపై సమీక్షించింది. దాదాపు 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి అయితే ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ప్రతిష్టాత్మకంగా మారనుంది.