
ఆంధ్రప్రదేశ్ లో గల్లా కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే కనిపిస్తుంది. ఇక ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే వారు కూడా కనిపించడం లేదు. గల్లా అరుణ కుమారి వృద్ధాప్యంతో ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇక ఆమె కుమారుడు గల్లా జయదేవ్ కూడా గతంలో గుంటూరు ఎంపీగా రెండు సార్లు గెలిచి తర్వాత 2024 ఎన్నికలకు ముందు తాను రాజకీయాలకు కొంతకాలం విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. 2024 జరిగిన ఎన్నికల్లోనూ కూటమికి వీచిన బలమైన గాలిలో గల్లా జయదేవ్ ఖచ్చితంగా విజయం సాధించే వారు. మరోసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యేవారు. అంతా బాగుంటే కేంద్ర మంత్రిగా కూడా అయ్యేవారు. కానీ తనంతట తానే తప్పుకోవడంతో ఆయన స్థానంలో గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్రమంత్రి అయ్యారు.
వ్యాపారాలకు ఇబ్బంది ఉండకూడదని…
2024 ఎన్నికలకు ముందు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే కొద్దికాలమేనని, తాను మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ఆయన తెలిపారు. వ్యాపారాలను గాడినపెట్టేందుకు వాటిని విస్తరించేందుకే గల్లా జయదేవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాజకీయాల్లో ఉండి వ్యాపారాలు చూసుకోవడం కష్టమని భావించి ఆయన వ్యాపారాలకే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎప్పుడైనా మళ్లీ ఎంట్రీ ఇవ్వవచ్చని, వ్యాపారాలు ఒకసారి దెబ్బతింటే అన్ని రకాలుగా కోలుకోలేకుండా పోతామని ఆయన అంచనా వేసి ఈనిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయంలో వాస్తవాలు చాలా ఉన్నాయనే అనుకోవాలి.
గుంటూరు ఖాళీ లేదు…
కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఆయన పోటీచేయడానికి ఎక్కడా ఖాళీలేదు. గుంటూరు నియోజకవర్గానికి టీడీపీ నేతగా పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చారు. ఆయన కూడా వ్యాపారవేత్త. ఎంపీలలోనే అత్యంత సంపన్నుడు కూడా. గుంటూరు జిల్లాకు స్థానికుడు. ఆర్థికంగా బలవంతుడు. ఇక గుంటూరు నియోజకవర్గం మాత్రం గల్లా జయదేవ్ చేతుల్లోకి మళ్లీ రాదన్నది కూడా అంతే వాస్తవం. పెమ్మసానిని కాదని గల్లా జయదేవ్ కు భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చే అవకాశం అస్సలు ఉండదు. అందుకే ఇక గుంటూరు నియోజకవర్గం గల్లా రాజకీయ డైరీ నుంచి కొట్టి వేయక తప్పదని ఆయనకు అర్థమయింది. అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
కూటమి పార్టీలు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్లా జయదేవ్ కు 2029 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం ఖాళీ లేదు. కూటమి పార్టీలు మళ్లీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండటంతో అన్ని ప్రధానమైన పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీలకు చెందిన నేతలున్నారు. ఇక శాసనసభకు పోటీ చేసే ఆలోచన లేదు. వారి కుటుంబానికి అడ్డాగా ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు పులవర్తి నాని ఉన్నారు. పైగా శాసనసభకు పోటీ చేసే ఆలోచనలో గల్లా జయదేవ్ లేరు. ఇక ఏదైనా ఛాన్స్ ఉంటే రాజ్యసభకు మాత్రమే ఆయన వెళ్లాల్సి ఉంటుంది. సామాజికవర్గం పరంగా చూసినా ఇప్పట్లో ఆఅవకాశం లేదన్నది కూడా అంతే నిజం. అందుకే గల్లా కుటుంబానికి రాజకీయానికి దాదాపుగా దూరమయినట్లేనన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.