
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉందని సాంకేతిక నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో మీ వాట్సాప్ ఖాతా యొక్క భద్రతను నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. హ్యాకర్లు వివిధ రకాల మోసపూరిత లింక్‌లు మరియు ఫైల్స్ ద్వారా మీ ఖాతాను హ్యాక్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా మీకు తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లలోని లింక్‌లపై లేదా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసే అనుమానాస్పద వెబ్సైట్ లింక్‌లపై, APK ఫైల్స్‌పై పొరపాటున కూడా క్లిక్ చేయకండి. ఇవి మీ వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించేందుకు లేదా మీ ఫోన్‌ను హ్యాక్ చేసేందుకు ఉద్దేశించినవి కావచ్చు.
మీ వాట్సాప్ హ్యాక్ అవ్వకుండా, మీ పర్సనల్ డేటా ఇతరుల పాలు కాకుండా ఉండాలంటే మీరు వెంటనే వాట్సాప్ టూ-స్టెప్ వెరిఫికేషన్ (2-Step Verification) ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవడం అత్యంత ముఖ్యం. ఈ ఫీచర్ మీ ఖాతాకు ఎక్స్ ట్రా సెక్యూరిటీని అందిస్తుంది. ఒకవేళ ఎవరైనా మీ సిమ్ కార్డ్‌ను వేరే ఫోన్లో ఉపయోగించి మీ వాట్సాప్ ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినా, ఈ టూ-స్టెప్ వెరిఫికేషన్ పిన్ నెంబర్ అడగడం వల్ల వారు మీ ఖాతాను ఓపెన్ చేయలేరు.
టూ-స్టెప్ వెరిఫికేషన్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?
వాట్సాప్ అప్లికేషన్లో ఇలా పాలో అవ్వండి.
* మొదట మీ ఫోన్లో వాట్సాప్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
* కుడివైపు పైభాగంలో ఉన్న మూడు నిలువు చుక్కలపై (మెనూ బటన్) క్లిక్ చేయండి.
* డ్రాప్‌డౌన్ మెనూ నుండి ‘Settings’ (సెట్టింగ్‌లు) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* సెట్టింగ్స్ పేజీలో ‘Account’ (ఖాతా) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* ఖాతా సెట్టింగ్స్‌లో ‘Two-step verification’ (టూ-స్టెప్ వెరిఫికేషన్) అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
* తర్వాత కనిపించే ‘Enable’ (ఎనేబుల్ చేయి) బటన్‌పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీరు ఆరు అంకెల పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు గుర్తుండే ఒక బలమైన పిన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
* మీరు ఎంటర్ చేసిన పిన్ నెంబర్‌ను మరోసారి కన్ఫాం చేయండి.
* చివరగా, మీ ఇమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు మీ పిన్ నెంబర్‌ను మరచిపోతే, ఈ ఇమెయిల్ ద్వారా మీరు మీ ఖాతాను తిరిగి పొందవచ్చు. ఇమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ‘Save’ (భద్రపరచు) బటన్‌పై క్లిక్ చేయండి.
* అంతే! మీ వాట్సాప్ ఖాతాకు టూ-స్టెప్ వెరిఫికేషన్ విజయవంతంగా ఎనేబుల్ చేయబడింది. ఇకపై మీ వాట్సాప్ ఖాతాను కొత్త పరికరంలో లాగిన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఆరు అంకెల పిన్ నెంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సైబర్ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండటం, మీ డిజిటల్ సెక్యూరిటీని కాపాడుకోవడం చాలా అవసరం.