
డైనమిక్ బ్యూరో: (Char Dham Yatra) చార్ధామ్ యాత్ర సాఫీగా సాగుతోందని, ప్రజలు ఎలాంటి రూమర్లు నమ్మొద్దని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Uttarakhand CM Pushkar Singh Dhami) వెల్లడించారు. (Operation Sindoor) ఆపరేషన్ సిందూర్ అనంతరం (India, Pakistan) భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భక్తుల భద్రతా దృష్ట్యా చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎక్స్ వేదికగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. చార్ధామ్ యాత్ర సాఫీగా సాగుతోందని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
యాత్రకు సంబంధించిన ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నంబర్లు 1364 లేదా 0135-1364 సంప్రదించండని సీఎం సూచించారు. కాగా, ఉద్రిక్తల నేపథ్యంలో (Badrinath, Kedarnath, Gangotri, Yamunotri) బద్రినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. చార్ధామ్ యాత్ర జరిగే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలతో మోహరించారు. ప్రస్తుతం హెలికాప్టర్ సేవలు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 30న చార్ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే.