
Supreme Court Order
కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు గతంలో హైకోర్టు… పిటిషనర్ కు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2015 మార్చి 27న తీర్పిచ్చింది. దీనితో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహనరావు సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని రక్షించడానికే తాను చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నట్లు విన్నవించారు. ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) విభజన ఉద్యమం జరుగుతున్న ఆ రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఉండేవని, అందువల్ల కొందరు రాత్రికి రాత్రి వేసుకున్న గుడిసెలను మాత్రమే తొలగించామని చెప్పారు. 48 గంటలకు మించి జైల్లో ఉంటే ఉద్యోగం పోతుందని, దానివల్ల పిటిషనర్ కుటుంబం రోడ్డున పడుతుందని, పిల్లల చదువులు దెబ్బతింటాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
దీనిపై జస్టిస్ బీఆర్ గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ… ‘గుడిసెలను తొలగించి.. అందులో నివాసం ఉంటున్నవారిని రోడ్డు మీదికి తోసేసినప్పుడు ఇవన్నీ ఆలోచించి ఉండాల్సింది. పిటిషనర్‌ను జైలుకు పంపితే ఆయన ఉద్యోగం పోతుంది. ఆయన మొండితనం, నిర్లక్ష్య వైఖరి వల్ల కుటుంబసభ్యులు జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల జైలుశిక్షపై ఉదార వైఖరి తీసుకున్నాం. అయితే ఎంతటివారైనా చట్టానికి అతీతులు కాదన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాం. అందుకే హైకోర్టు మోహన్‌రావుకు విధించిన శిక్షను సవరించి… డిప్యూటీ కలెక్టర్ పదవి నుంచి తహసీల్దార్ పోస్టుకు డిమోట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. ఆయన పేదల ఇళ్ల నిర్మాణం కోసం నాలుగు వారాల్లోపు లక్ష రూపాయలు జరిమానా చెల్లించి, రసీదును కోర్టుకు సమర్పించాలి. తదుపరి పదోన్నతుల కోసం ఆయన సీనియారిటీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంతేకాదు జైలు శిక్ష తప్పించుకోవాలంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి తగ్గి తహసీల్దార్ పదవి చేపట్టడానికి అంగీకరిస్తూ అండర్‌టేకింగ్ లెటర్ ఇవ్వాలని గత వాయిదాల్లోనే సూచించినా పిటిషనర్ అంగీకరించకపోవడంతో జస్టిస్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ‘పిటిషనర్ తొలిరోజే ఇందుకు అంగీకరిస్తే మేం 2, 3 ఇంక్రిమెంట్ల కోతతో ఆపేసేవాళ్లం. కానీ నాలుగు వాయిదాల వరకు తీసుకొచ్చారు. ఈ రోజు కూడా మా సూచనను అంగీకరించకపోతే మేం ఏ ప్రభుత్వం సాహసించలేని ఉత్తర్వులిచ్చేవాళ్లం. ఇలాంటి ఉత్తర్వులిచ్చేటప్పుడు మాకూ బాధ ఉంటుంది. కానీ నిస్సహాయులం’ అని వ్యాఖ్యానించారు.