ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డులన్నీ స్మార్ట్ కార్డుల రూపంలో అందించనున్నారు. డెబిట్ కార్డు సైజులో రేషన్ కార్డు ఉంటుంది. క్యూ ఆర్ కోడ్ ఉంటుంది ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలన్నీ నమోదయి ఉంటాయి. నిజంగా దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది తీపి కబురు. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూపులు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అర్హత ఉన్నప్పటికీ ఇంకా రేషన్ కార్డు అందని వారి సంఖ్య లక్షల్లోఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.
అనర్హులైన వారున్నారంటూ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.30 కోట్ల తెలుపు రంగు రేషన్ కార్డులున్నాయి. వీరిలో అర్హులైన వారున్నారు. అర్హత లేని వారున్నారు. వీరిలో అనర్హులను ఏరివేసే కార్యక్రమం కొంతకాలం క్రితం ప్రారంభమయింది. ఈ రేషన్ కార్డులు అర్హతలు లేకపోయినా పొందిన వారు కూడా ఉన్నారు. దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్నవారితో పాటు పొరుగు రాష్ట్రంలో స్థిరపడిన వారు కూడా ఇక్కడ తెలుపు రంగురేషన్ కార్డు ఉండటంతో ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. ఈమేరకు పెద్దయెత్తున కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. అందుకే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసం ఉంటూ ఇక్కడ తెలుపు రంగు రేషన్ కార్డులు పొందుతూ అనేక ప్రయోజనాలను అందుకుంటున్నారు. వీరిలో చాలా వరకూ ఏరివేశారంటున్నారు.
మార్గదర్శకాలలో మార్పులు…
కొత్త రేషన్ కార్డుల జారీలో అనేక మార్గ దర్శకాలను కూడా ప్రభుత్వం విడుదలచేసింది. కుటుంబ సభ్యుల పేర్ల తొలగింపుతో పాటు, కొత్త సభ్యుల పేర్లను చేర్చుకునే వీలుంది. అలాగే అడ్రస్ మార్పు కూడా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలు కూడా రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకోవచ్చు. తెలుపు రంగు రేషన్ కార్డులు పొందాలంటే నెలవారీగా పదివేల రూపాయల ఆదాయం రూరల్ ప్రాంతాల్లో ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలకు మించకూడదు. గత ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలను విధించింది. వీరిలో కొందరికి అంటే అంగన్ వాడీ కార్యకర్తలకు కొంత మినహాయింపు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. అంగన్ వాడీ కార్యకర్తలు నిరంతరం పనిచేస్తున్నా వారు గత ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.కొంత మినహాయింపులతో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశముంది.