
ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో, భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం 07-05-2025 తెల్లవారుజామున 1:44 గంటలకు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడిని నిర్వహించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్‌ను నిరంతరం పర్యవేక్షించారు.
కోట్లీ, మురిద్కే, బహవల్పూర్, చక్ అమ్రు, భీంబర్, గుల్పూర్, సియాల్కోట్, ముజఫరాబాద్‌లోని స్థావరాలపై భారతదేశం దాడులు చేసిందని పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. సియాల్కోట్, బహవల్పూర్, చక్ అమ్రు, మురిద్కే అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్నాయి. మిగిలినవి పీఓకేలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్నాయి. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, “భారతదేశం నిర్వహించిన ఈ యుద్ధ చర్యకు స్పందించే హక్కు పాకిస్తాన్‌కు ఉంది. బలమైన ప్రతిస్పందన ఉంటుంది.” అని అన్నారు.
ఇంతలో భారత్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందంటూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. 2024 సెప్టెంబర్ లో చోటు చేసుకున్న మిగ్-29 ఫైటర్ జెట్ ప్రమాదాన్ని ఆపరేషన్ సింధూర్ కు ఆపాదిస్తూ ఉన్నారు.
వైరల్ పోస్టుల్లో మంటల్లో ఓ విమానం ఉండడాన్ని మనం చూడొచ్చు. ఈ విజువల్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించాం. 2024 నుండి ఈ విజువల్స్ ఆన్ లైన్ లో ఉన్నాయని మేము ధృవీకరించాం.
“IAF Plane Crash in Rajasthan: Indian Air Force MiG-29 Fighter Jet Crashes Near Barmer, Pilot Safe (Watch Video)” అనే టైటిల్ తో లోక్ మత్ న్యూస్ కథనం మాకు లభించింది. ఆ కథనంలో ఉపయోగించిన ఫోటో, వైరల్ ఫోటో ఒకటేనని మేము ధృవీకరించాం.
“సోమవారం సాయంత్రం బర్మార్ లో భారత వైమానిక దళం (IAF)కి చెందిన MiG-29 యుద్ధ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు. ప్రమాదం తర్వాత జెట్ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది” అని సెప్టెంబర్, 2024లో ఆ కథనం నివేదించింది.
ఈ ప్రమాదం గురించి సెప్టెంబర్ 02న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్వీట్ చేసినట్లు కూడా మేము గుర్తించాం.
ఇదే విజువల్స్ ను IANS తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. “During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered: IAF” అంటూ పోస్టు పెట్టింది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. మిగ్-29 విమానంలో చోటు చేసుకున్న టెక్నీకల్ ఎర్రర్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వివరించింది.
ఈ ఘటనకు సంబంధించిన పలు నివేదికలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
ఈ ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేయాలని కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించినట్లు వైమానిక దళం తెలిపిందని ఇండియా టుడే నివేదించింది. బార్మర్ జిల్లా కలెక్టర్ నిశాంత్ జైన్, పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర సింగ్ మీనా, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని నివేదికలు తెలిపాయి.
వైరల్ అవుతున్న పోస్టులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయని D-Intent Data కూడా నివేదించింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.