హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 17 : ధూల్ పేట, జియాగూడలలో గురువారం ఎస్ఎఫ్ఏ బృందం సభ్యులు చేసిన దాడిలో 26.7 కేజీల గంజాయి పట్టుబడింది. దాని విలువ రూ.13.50లక్షలు ఉంటుందని బృందం అధికారి అంజిరెడ్డి తెలిపారు. ధూల్పేటలో రాణి అవంతిబాయ్ విగ్రహం సమీపంలో ఒడిశా నుంచి దిగుమతి చేసుకున్న 25.230 కిలోల గంజాయిని తీసుకెళుతున్న ఆకాష్ సింగ్ను ఎన్డీఎఫ్ఎఏ టీమ్ సిబ్బంది దాడిచేసి పట్టుకుంది. అతన్ని అదుపులోకి తీసుకుని ఈ కేసుతో సంబంధం ఉన్న ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు అంజిరెడ్డి తెలిపారు. జియాగూడ పీలా కాశీ శివమందిర్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న భద్రినారాయణ్ సింగ్ను అరెస్ట్ చేసి, అతని నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో బంగ్లావాలా అజయ్ సింగ్, మంజుదేవీలకు సంబంధం ఉండడంతో వారిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
