- విలువ రూ.6.16లక్షలు
- నిందితుడి అరెస్ట్.. పరారీలో మరొకరు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ : ఒడిశా నుంచి ముంబైకి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తరలిస్తున్న 12.318కిలోల గంజాయిని గురువారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే జీఆర్పీ పోలీస్ స్టేషన్లో రైల్వే డీఎస్పీ జావెద్, సీఐ సాయి ఈశ్వర్ గౌడ్ లు వివరాలు వెల్లడించారు. ఒడిశా గజపతి జిల్లాకు చెందిన మున్నా నాయక్ (28), అదే ప్రాంతానికి చెందిన సమీరా బిష్తోయి దేబాకుమార్ బిషోయి (31) స్నేహితులు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిషోయికి మహారాష్ట్రకు గంజాయి సరుకును చేరవేస్తే లాభాలొస్తాయని ఆశచూపాడు. అందుకు ఒప్పుకొన్న బిషోయికి అడ్వాన్స్ రూ.10 వేలు, సరుకుతో పాటు మరో రూ.12 వేలు ముట్టజెప్పాడు. ఈనెల 16న ఇద్దరు కలిసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. గురువారం సికింద్రాబాద్‌కు చేరుకున్న రైలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. జనరల్ కోచ్‌లో బెర్త్‌లు కింద దాచిపెట్టిన గంజాయి పట్టుబడింది. బెర్త్ పక్కనే ఉన్న బిషోయి అనుమానాస్పదస్థితిలో కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇతని వెంట ఉన్న మున్నానాయక్ తప్పించుకున్నాడు. బిషోయిని నుంచి వివరాలు సేకరించగా ఈ సరుకు మహారాష్ట్రకు తీసుకెళుతున్నట్లు తెలిపాడు. 12.318 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టుకున్న గంజాయి విలువ రూ6.16 లక్షలుంటుందని తెలిపారు. పరారీలో ఉన్న మున్నానాయక్ కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
