
బంగారం ధరలు ఎంత పెరిగాయో.. అంత తగ్గేంత వరకూ కొనుగోళ్లు మాత్రం పెద్దగా పెరగలేదు. బంగారం ధరలు ఈ ఏడాది భారీ స్థాయిలో పెరిగాయి. ఏ స్థాయిలో అంటే పది గ్రాముల బంగారం ధర లక్షకు చేరుకుంది. ఇంకా పెరుగుతుందని మార్కెట్ నిపుణుల నుంచి బిజినెస్ నిపుణుల వరకూ ఒకటే రివ్యూల మీద రివ్యూలు ఇచ్చారు. తొందరపడి కొనేయమని సలహా కూడా ఇచ్చారు. అయినా అంత ధరలు పెట్టి కొనుగోలు చేయడం ఎందుకన్న ధోరణితో చాలా మంది బంగారం, వెండి కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. పెళ్లిళ్లయినా, శుభకార్యాలయినా.. అక్షర తృతీయ అయినా బంగారం విషయంలో ధరలను చూసి టెంప్ట్ కాలేదు. తగ్గినప్పుడు కొనుగోలు చేయవచ్చులే అని భావించారు.
మధ్యతరగతి దూరం…
సాధారణంగా బంగారాన్ని ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసేది మధ్యతరగతి ప్రజలు మాత్రమే. వారికే బంగారం పై ఎక్కువ మోజు ఉంటుంది. అదే వారే కొనుగోలుకు దూరమయితే ఇక ఎవరు కొంటారు. సంపన్నులకు ఎంత ధర పెరిగినా.. ధరలతో సంబంధం లేకుండా తాము కొనుగోలు చేసే శక్తి ఉంటుంది కాబట్టి బంగారం కోసం దుకాణాలకు పరుగులు పెట్టరు. ఆ ఒక్క కారణం వల్లనే బంగారం అమ్మకాలు దాదాపుగా అరవై శాతం గత ఏడాదితో పోలిస్తే తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే సమయంలో బంగారం ధరలు ఇక తగ్గవని చెబుతున్నప్పటికీ, తగ్గకపోయినా పరవాలేదు కానీ, అంత ధర పెట్టి కొనుగోలు చేయడం అనవసరమన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చారు.
స్వల్పంగా తగ్గి…
అలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తున్నాయి. భారీగా పెరగడమే కాకుండా అంతే స్థాయిలో పతనం కూడా అవుతున్నాయి. బంగారం ధరలు ఎంత తగ్గుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం పెరగడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై 170 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదయిన ధరలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నానికి మారే అవకాశముండవచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 87,690 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 95,650 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 1,09,100 రూపాయలకు చేరుకుంది.