
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ శాఖ వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరో రెండు డిగ్రీలు అధికంగానే నమోదవుతాయని, ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రజలు బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది.
రానున్న రెండు రోజులు…
వచ్చే రెండురోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి జట్లులు పడే అవకాశముందని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. పగటి వేళల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి వృద్ధులు, దీర్ఘకాలికరోగులు, చిన్నారులు శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఎప్పటికప్పుడు నీటిని తాగుతుండాలని, కనీసం రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు. దీంతో పాటు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మే 5వ తేదీ వరకూ…
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సాయంత్రానికి కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశముందని పేర్కొంది. గరిష్టంగా పగటి ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు చేరుకునే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. మే ఐదో తేదీ వరకూ వర్షాలు పడే అవకాశముందని కూడా తెలిపింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట్, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని, ఇదే సమయంలో వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది. ప్రయాణాలు చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.