
వైసీపీ అధినేత జగన్ ఒక్క ఛాన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి రాకముందు అంటే వైసీపీ పార్టీ పెట్టిన నాటినుంచి నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు. ఏదైనా చేయాలంటే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. కేంద్ర పార్టీ కార్యాలయం పిలుపు ఇచ్చినప్పుడు మాత్రమే స్పందించాలి. అదే విధంగా పార్టీ కేంద్ర నాయకత్వం రూపొందించిన కార్యక్రమాలను అమలు చేయడమే జిల్లా, నియోజకవర్గాల స్థాయి నేతల పని. అంతే తప్పించి వారంతట వారుగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వలేదు. కారణం జిల్లాలో నేతలు తమకు ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాలను నిర్వహిస్తే రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని అనుకుని ఈ రకమైన ఆదేశాలు జారీ చేశారు.
మొన్నటి వరకూ…
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు మాత్రమే మీడియా సమావేశాలు కూడా పెట్టాలి. నాటి ప్రతిపక్షంపై విమర్శలు చేయాలన్నా ఎంపిక చేసిన నేతలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎవరంటే వారు స్పందించడం అనేది వైసీపీలో అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు సాగలేదు. బహుశ ప్రాంతీయ పార్టీల్లో ఎందులోనైనా రాష్ట్రం ఏదైనా ఇదే విధానాన్ని పార్టీ అధినేతలు అమలు పరుస్తుంటారు. వైసీపీలో కూడా అదే తీరు ఇప్పటి వరకూ నడిచింది. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత జగన్ లో మార్పు కనిపిస్తుంది. తరచూ నేతలతో ఆయన సమావేశమవుతున్నారు. భవిష్యత్ మనదేనని భరోసా ఇస్తున్నారు.
జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో…
తాజాగా జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నేతలకు జగన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పడంతో పాటు స్థానిక సమస్యలపై జిల్లా అధ్యక్షులు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వారికి అండగా నిలబడే ప్రయత్నిం చేయాలని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నించాలని జగన్ అన్నారు. ప్రజల్లో తిరుగుతున్న తీరు, నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమన్వయం చేసుకుని ఎక్కడికక్కడ కార్యక్రమాలను రూపొందించుకోవలాని కూడా జగన్ తెలిపారు.
పార్టీ ఓనర్ షిప్ మీదేనంటూ…
అంతే కాదు జగన్ మరో ముఖ్యమైన పదాన్ని సమావేశంలో వాడటం అందరినీ ఆశ్చర్యపర్చింది. మీ జిల్లాలో పార్టీ ఓనర్ షిప్ మీదేనని వారికి చెప్పారు. పార్టీ అధ్యక్షులదే కీలక బాధ్యత అని తెలిపారు. ఎవరి నుంచో ఆదేశాలు వస్తాయని ఎదురు చూడవద్దని, వెంటనే నిర్ణయాలు తీసుకుని ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాలని జగన్ అనడం నిజంగా జల్లా నేతలకు, నియోజకవర్గాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లేనా? అన్న సందేహం కలుగుతుంది. నియోజకవర్గ ఇన్ ఛార్జిని స్వయంగా కలుసుకుని వారితో ఎప్పటికప్పడు మాట్లాడాలని తెలిపారు. అలాగే మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలను, జూన్, జులై నెలల్లోగా గ్రామ, మున్సిపాలిటీల్లోని డివిజన్ కమిటీలను పూర్తి చేయాలని, ఆగస్టు, సెప్టంబరు, అక్టోబరు నాటికి బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా తెలిపారు. మొత్తం మీద జగన్ నేతలకు ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్లేనని అర్థమవుతున్నా ఏ మేరకు నేతలు చొరవ తీసుకుంటారన్నది చూడాలి.