
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడకూలి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈరోజు తెల్లవారరు జామున కురిసిన భారీ వర్షానికి రూ.300 క్యూలైన్ దగ్గర గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ విశాఖకు చేరుకోనున్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ…
కేజీహెచ్ లో పోస్టుమార్టం నిమిత్తం ఎనిమిది మంది మృతదేహాలు ఉంచారు. వారికి బంధువులకు అప్పగిస్తే వారి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించనున్నారు. లేదంటే కేజీహెచ్ లోనే బాధితుల కుటుంబాలను పరామర్శిస్తారని నేతలు చెబుతున్నారు. కొందరు గాయపడి చికిత్స పొందుతున్నారు. వారిని కూడా జగన్ పరామర్శించనున్నారు. విశాఖపట్నానికి జగన్ వస్తుండటంతో పెద్దయెత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.