
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు బిగ్ అప్ డేట్ ఇచ్చేసింది. రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. వాయవ్య మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కొనసాగుతున్న ద్రోణి కారణంగా రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని తెలిపింది. తెలంగాణలోనూ రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని, ఈదురుగాలులు కూడా బలంగానే వీస్తాయని పేర్కొంది. అందుకే ప్రధానంగా రైతులు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బలమైన ఈదురుగాలులు…
ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈరోజు రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పింది. రాయలసీమ ప్రాంతంలోని అనేక జిల్లాల్లో నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. అందుకే అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని, తమ పంట ఉత్పత్తులను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో ఎల్లో అలెర్ట్…
తెలంగాణలోనూ వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం పేర్కంది. ఈరోజు యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెప్పింది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కీలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. పగటి పూట మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు పగలంతా ఉక్కపోతకు గురవ్వడం ఖాయమని తెలిపింది.