
ఎంత సహనం సంయమనం ఉన్నా కూడా ఎవరూ ఎల్ల కాలం ఏదీ మనసులోనే ఉంచి బయటకు నవ్వులు చిందించలేరు. ఇక మనసులో ఏదైనా బాధ కానీ అసంతృప్తి కానీ ఉంటే అది మెల్లగా మొదలై అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఇక రాజకీయాల్లో అనుకూలత ఉంటే ఓకే. ఇబ్బంది ఉంటే నాయకులు అసలు తట్టుకోలేరు.
ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జిగా ఉన్న ఎస్వీ ఎస్ ఎన్ వర్మ పరిస్థితి అలాగే ఉందా అన్న చర్చ సాగుతోంది. ఆయనకు పదవులు లేక చాలా కాలం గడిస్తోంది. ఎమ్మెల్యేగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అనుకున్న వేళ పవన్ ని స్వయంగా తానే గెలిపించాల్సిన వచ్చింది. ఇక ఎమ్మెల్సీగా అయినా చట్ట సభలో సత్తా చాటుకుందామని అనుకుంటే ఆ ముచ్చటా లేకుండా పోయింది.
దాంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంబరం లేకుండా ఉంది అని అంటున్నారు. ఇంకా వైసీపీ అధికారంలో ఉందా అన్న వర్మ వ్యాఖ్యలు వెనక అర్ధాలు వెతుక్కుంటే బోలెడు కనిపిస్తాయి. తనకు పదవులు దక్కని వైనం కూడా ఆయనలో ఒకింత అసంతృప్తిని కలుగచేస్తోంది అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురంలో పర్యటిస్తే ఆ కార్యక్రమానికి వెళ్ళకుండా వర్మను పోలీసులు అడ్డుకోవడం పట్ల రగిలిపోతూ వర్మ ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇంకా వైసీపీ అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీస్ అధికారి ఉన్నరంటూ వర్మ దుయ్యబెట్టారు. తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా అని కూడా ప్రశ్నించారు. అయినా క్రమశిక్షణతో భరిస్తుస్తున్నాం అని ముక్తాయింపు ఇచ్చారు.
వర్మ అంతలా భరిస్తున్న బాధలు దేనికి సంబంధించినవి అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. నిజానికి పవన్ కార్యక్రమానికి మొదట వర్మను అడ్డుకున్నా తరువాత ఆయనను అనుమతించారు. ఆయన అనుచరులను పంపారో లేదో తెలియదు. అయితే వర్మ మాత్రం భరిస్తున్నామని బరువైన మాటనే వాడారు.
మరి నాలుగేళ్ళకు పైగా కూటమి పనిచేయాల్సి ఉంది. వర్మకు ఏడాదితే భరిస్తున్నామని వేడి నిట్టూర్పులు రావడంతో ఆయన మనసులో ఎంత బరువు ఉందో అది ఎన్ని టన్నులకు తూగుతుందో అన్న చర్చకు తెర లేచింది. వర్మ తీరు చూస్తూంటే రోజు రోజుకూ ఓపెన్ అయిపోతున్నారా అని కూడా అనుకుంటున్నారు.
ఇలా ఎందుకు అంటే ఆయనకు కేవలం పార్టీ పదవి తప్ప మరేమీ లేదు. ఇక అధికారులు కూడా ఆయన రాకను అడ్డుకుంటున్నారు. జనసేన నేతల కార్యక్రమాలకు సరిగ్గా పిలుపులు రావడం లేదు. దాంతో పాటు తన సొంత నియోజకవర్గంలో తననే అవమానిస్తున్నారు అన్న ఆవేదన ఆయనలో అంతకంతకు పెరిగిపోతోంది. దాంతో వర్మ ఈ విధంగా ట్వీట్లు చేస్తున్నారా అని చర్చిస్తున్నారు.
ఏది ఏమైనా వర్మ భరిస్తున్నాం అన్న ఒక్క మాట చాలు వేయి అర్ధాలు అందులో వెతుక్కోవచ్చు అని అంటున్నారు. మరి వర్మ ట్వీట్ ని సరిగ్గా డీ కోడ్ చేసుకుంటే ఆయనకు తగిన న్యాయం చేసేలా ఆలోచనలు చేస్తేనే పిఠాపురంలో సీన్ మారుతుందని అంటున్నారు. లేకపోతే వర్మ నుంచి మరిన్ని ఈ తరహా ట్వీట్లు వచ్చేందుకే ఆస్కారం ఉంటుందని అంటున్నారు.