
సాధారణంగా మన రైతులు వారి పొలాలను సారవంతం చేసేందుకు పశువుల పేడను ఎరువుగా ఉపయోగించడం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాను కువైట్ కు చెందిన అరబ్ షేక్‌లు కూడా నమ్ముతున్నారు. పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్న మన దేశం నుంచి ఏకంగా రూ.400కోట్ల విలువైన ఆవు పేడను వారు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ వారు ఈ పేడను ఎందుకు కొంటున్నారు? దీని వెనుక ఉన్న కారణం తెలుసుకుందాం.
మనదేశంలో పశువుల పేడ సహజ ఎరువుగా పరిగణిస్తుంటాం. ఇది నేల పోషక విలువలను పెంచడమే కాకుండా, పంట దిగుబడిని కూడా పెంచుతుంది. తరతరాలుగా భారతీయ రైతులు ఈ సంప్రదాయ పద్ధతినే అనుసరిస్తున్నారు. దీంతో ఇప్పుడు కువైట్‌లోని అరబ్ షేక్‌లు కూడా ఇదే విధానాన్ని పాటించాలని భావిస్తున్నారు. వారు భారతీయ ఆవుల పేడను దిగుమతి చేసుకోవడానికి ప్రధాన కారణం వారి ఖర్జూర పంటల దిగుబడిని పెంచడమే.
కువైట్‌లో ఖర్జూర పంటలే ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తి. అయితే, అక్కడి నేల పరిస్థితులు కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో దిగుబడిని అందించడం లేదు. దీంతో భారతీయ ఆవుల పేడ సహజమైన ఎరువుగా పనిచేసి, ఖర్జూర చెట్లకు అవసరమైన పోషకాలను అందజేస్తుంది. దీనివల్ల ఖర్జూర పండ్లు పెద్దవిగా, ధిక దిగుబడితో వస్తాయని వారు నమ్ముతున్నారు. అంతే కాకుండా సహజ ఎరువులు వాడడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.
మనదేశం నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఆవు పేడను కువైట్ దిగుమతి చేసుకోవడం నిజంగా వింత విషయమే. ఓ వైపు మన రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు మన దేశంలోని పేడకు విదేశాల్లో ఇంత డిమాండ్ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే, ఈ వార్త మన రైతులకు ఒక కొత్త ఆదాయ వనరుగా మారే అవకాశం కూడా ఉంది. మొత్తానికి, భారతీయ ఆవుల పేడ కువైట్‌లోని కర్జూర పంటలకు బంగారు పంట పడిస్తుందో లేదో చూడాలి.