
పావలా మాంసానికి అర్ధరూపాయి మసాలా అన్నట్లుగా జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇది సాధారణంగా వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం చాలా మంది వెచ్చించే సొమ్ము విషయంలో వినిపిస్తుంటుంది. ఇందులో కొంతమందికి నెంబర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది. ఈ సమయంలో అలాంటి ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది.
అవును… వాహనాల ఫ్యాన్సీ నంబర్స్ కోసం చాలామంది పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటారు. అందులో కొన్ని సంఘటనలు షాకింగ్ గా ఉంటాయి. ఆ నంబర్ కోసం పెట్టిన డబ్బులతో మరో రెండు మూడు వాహనాలు వస్తాయి కదా అని అనిపిస్తుంటుంది! ఈ క్రమంలో తాజాగా రూ.1 లక్ష స్కూటర్ కోసం రూ.14 లక్షలు నంబర్ కి వేలం వేసిన వ్యవహారం తెరపైకి వచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే… హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ కు చెందిన సంజీవ్ కుమార్ రూ.1 లక్ష పెట్టి స్కూటర్ కొన్నాడు. ఈ సమయంలో తనకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ హెచ్.పీ21సీ-0001 కోసం ఆన్ లైన్ వేలంలో రూ.14 లక్షలు ఖర్చు చేశాడు! దీంతో.. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నంబర్ సెంటిమెంట్ ఇంత పనిచేయించిందని అంటున్నారు నెటిజన్లు.
అయితే… ఇలాంటి అసాధారణ ఘటనలు హిమాచల్ ప్రదేశ్ లో జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. సుమారు రెండేళ్ల క్రితం.. దేశ్ రాజ్ అనే వ్యక్తి తన టూవీలర్ వాహనం కోసం హెచ్.పీ99-9999 నంబర్ కు రూ.1.12 కోట్లు వేలం వేశాడు. అయితే… వేలంలో గెలిచిన తర్వాత అతను అంత పెద్దమొత్తంలో డబ్బు ఆర్టీఏ కి చెల్లించలేకపోయాడు!
దీంతో… అధికారులు రెండవ అత్యధిక బిడ్డర్ ను సంప్రదించారు. అయితే.. అతను కూడా నిరాకరించాడు. ఇదే క్రమంలో… మూడవ బిడ్డర్ కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి. అప్పటి నుండి అలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా.. రవాణా శాఖ బిడ్ మొత్తంలో 30% ముందుగానే డిపాజిట్ చేయడం తప్పనిసరి చేసింది. ఫైనల్ గా ఆ నంబర్ ను ఇంద్ర కల్టా అనే మహిళ రూ.29.98 లక్షలకు పొందింది.