
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధానికి దాదాపు తెరలేచింది. ఎవరు తగ్గడం లేదు. మేము సహకరిస్తాం మీరు అడ్డు పడొద్దు అని చంద్రబాబు తాజాగా ప్రకటన చేసినా ఆయన చేసినంత తేలిగ్గా అయితే విషయం లేదు. బనకచర్ల ప్రాజెక్టును కట్టాలనేది చంద్రబాబు కల కావచ్చు. చంద్రబాబు ఆశయం కావచ్చు. కానీ ఈ ప్రాజెక్టును కట్టడం ద్వారా గోదావరి జలాలను తెలంగాణ నుంచి ఏపీ తరలించుకు పోతోందన్న వాదనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చలేకపోతోంది.
పైగా తెలంగాణ ప్రభుత్వమే ఈ వాదనను లేవనెత్తుతోంది. తమకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుపై యుద్ధానికి సయ్యన్నట్టుగానే వ్యవహరించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు జోక్యం చేసుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు కేంద్రం ఎట్లా వ్యవహరిస్తుంది ఏం చేస్తుంది అనే దానిపై అనేక కథనాలు వస్తున్నాయి. అనేక వార్తలు, అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఎట్లా చూసుకున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరిదైనా ఎప్పుడైనా ప్రజా కోణం కంటే రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటుంది.
పైగా ఇప్పుడిప్పుడే తెలంగాణలో బిజెపి బలపడుతుండడం వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి దాదాపు వస్తామన్న ఆశ ఉండడం కారణంతో తెలంగాణ కు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రభావం చూపిస్తుంది. పైగా నీళ్లు -నిధులు -నియామకాలు అనే మూడు సిద్ధాంతాల ద్వారా ఏర్పడిన తెలంగాణకు నీటి విషయంలో బిజెపి అన్యాయం చేస్తుందన్న ప్రచారం గనుక తెర మీదకు వస్తే అది దీర్ఘకాలంలో పార్టీకి పార్టీ ప్రయోజనాలకు కూడా తీవ్ర భంగం కలిగిస్తుంది.
దీంతో బనకచర్ల విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ వాదాన్ని బలపరిచే అవకాశం ఉంది. అయితే ఏపీలోనూ బిజెపి అధికారంలో ఉంది. ఒక మంత్రి కూడా ఉన్నారు. రాష్ట్రంలో కీలక భాగస్వామ్య పార్టీగా కూడా ఉంది. అందుకే సీఎం చంద్రబాబు చాలా ధైర్యంగా బనకచర్లను కట్టి తీరుతామని చెబుతున్నారు. ఎందుకంటే బిజెపి తమకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆయన నమ్మడమే. నమ్మకం తప్పు కాదు. ఆశ ఉండడం తప్పు కాదు.
కానీ రాజకీయంగా చూసుకున్నప్పుడు తెలంగాణలో తమకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని బిజెపి అంచనా వేస్తున్న నేపద్యంలో ఈ విషయంపై ఇప్పట్లో అయితే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. సాగదీత ధోరణితో లేదా మీరు మీరు తేల్చుకోండి అని చెప్పడం ద్వారా కొన్నాళ్లపాటు దీన్ని నడిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నీటిపారుదల రంగ నిపుణులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈ గట్టో.. ఆ గట్టో అనేది బీజేపీకి ఇరకాటంగానే మారింది.