
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా గత ఏడాదిన్నరగా కొనసాగుతున్న షర్మిలలో అనూహ్యమైన మార్పు వచ్చిందా. ఆమె తానుగా పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. ఆమె తెలంగాణాలో తాను పెట్టుకున్న పార్టీని సైతం తెచ్చి కాంగ్రెస్ లో విలీనం చేశారు. దానికి బదులుగా ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవిని గత ఏడాది జనవరిలో ఇచ్చారు.
ఆ పదవిలో ఆమె 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఏమీ న్యాయం చేయలేకపోయకపోయారు. తాను కూడా తన సొంత గడ్డ కడపలో సైతం గెలవలేకపోయారు. ఇక నాటి నుంచి పార్టీని ఏదో విధంగా నడిపిస్తూ వస్తున్నారు. అయితే ఎన్నికల ముందు సరే అనుకున్నా ఎన్నికల తరువాత షర్మిల ఇంకా వైసీపీ మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. తన అన్న జగన్ మీదనే ఆమె బాణాలు ఎక్కుపెడుతున్నారు.
తాజాగా ఉత్తరాంధ్రా పర్యటనలోనూ ఆమె జగన్ నే నిందించారు. ఇంతే కాదు ఏ అవకాశం దొరికినా ఆమె జగన్ మీదనే టర్న్ చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ లో ఒకనాడు ఆమె వెంట ఉన్న పెద్ద నాయకులు సీనియర్లు అంతా కూడా దూరం అయిపోయారు. ఇపుడు షర్మిల ఉత్తరాంధ్రా పర్యటనలో ఉన్నారు కానీ ఆమెతో ఎవరూ లేరని అంటున్నారు.
ఇంతే కాదు కొద్ది రోజుల ముందు ఏపీలోని మొత్తం 26 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంతా కలసి షర్మిలను పీసీసీ చీఫ్ గా కొనసాగించవద్దని కోరుతూ హైకమాండ్ కి ఒక తీర్మానం చేసి పంపించారు అని ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో సీనియర్ మహిళా నేత సుంకరి పద్మశ్రీ అయితే షర్మిల పోకడల మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె ఇటీవల కడప జిల్లాకు వెళ్ళి మరీ కాంగ్రెస్ పార్టీ సమావేశం పెట్టారు.
షర్మిల పీసీసీ చీఫ్ గా సరిగ్గా పనిచేయడం లేదని ఆమె అంటున్నారు. కాంగ్రెస్ పెద్ద నాయకులు ఎంతో మంది ఉన్నా షర్మిల తన ఫోన్ నెంబర్ ని ఎవరికీ ఇవ్వడం లేదని తన పీఏకి ఫోన్ చేయమంటారు అని అంటున్నారు. అంతే కాదు ఆ పీఏ కూడా తెలంగాణాకు చెందిన వారు అని చెబుతున్నారు. దాంతో ఆమె హైదరాబాద్ లో ఉంటూ ఎవరికీ అందుబాటులో లేకుండా వ్యవహరిస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.
తనకు నచ్చిన సమయంలో ఆమె ఏపీలో పర్యటిస్తూ కేవలం తన అన్న మీదనే విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎదగాలి అంటే టీడీపీ బీజేపీల మీద విమర్శలు చేయాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే వ్యక్తిగత విషయాలను ఆమె కాంగ్రెస్ పార్టీకి చుడుతున్నారని దాని వల్ల కాంగ్రెస్ నష్టపోతోంది అని అంటున్నారు.
ఇక 2024 ఎన్నికల వేళ ఏఐసీసీ పెద్ద ఎత్తున పార్టీ ఫండ్ గా ఏపీకి పంపించారు అని అది సక్రమంగా పంపిణీ జరగలేదు అన్న విమర్శలు ఉన్నాయట. అలాగే పార్టీలో ఉన్న వారికి కాకుండా వేరే వారికి షర్మిల పార్టీ టికెట్లు ఇచ్చారని మరో ఆరోపణ నాటి నుంచే చేస్తున్నారుట.
ఇలా అనేక రకాలైన ఆరోపణలు ఫిర్యాదులతో కాంగ్రెస్ పెద్దలకు షర్మిల మీద ఏపీ నాయకులు గురి పెట్టి పెట్టారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఏపీలో కాంగ్రెస్ లో భారీ మార్పులు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ రకమైన ప్రచారంతో కలత చెందిన షర్మిల శ్రీకాకుళంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తనకు సొంత పార్టీలోనే వ్యతిరేకులు ఉన్నారని ఆవేదన చెందారని అంటున్నారు.
పీసీసీ చీఫ్ ఒక ముళ్ళ కిరీటం అని ఆమె అన్నారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని ఆమె చెప్పుకున్నారని అన్నారు. ఏపీ కాంగ్రెస్ లో నాయకత్వ లోపం ఉందని అంటే తాను వచ్చి బాధ్యతలు తీసుకున్నానని ఆమె చెప్పారని టాక్. తనను వద్దు అని అనుకుంటే తానే వెళ్ళిపోతా అని ఆమె అంటున్నారని కూడా చెబుతున్నారు. మొత్తానికి తనను మారుస్తారు అన్న వార్తలు కానీ సూచనలు కానీ ఆమెకు చేరాయా అందువల్లనే ఆమె ఈ రకంగా మాట్లాడుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఏది ఏమైనా ఏపీ కాంగ్రెస్ లో కొద్ది రోజులలో భారీ మార్పులు వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.