
ఏపీలో పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ కి కూటమి ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇదంతా కేవలం గోదావరి నుంచి దిగువకు ప్రతీ ఏటా వచ్చే వరద నీరు సముద్రంలో కలసిపోతూండడంతో దానిని దారి మళ్ళించి రాయలసీమతో సహా ఆరు జిల్లాలకు నీరు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఏకంగా 81 వేల కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్ట్ ని రూపొందించాలని అనుకుంటోంది. అయితే ఇంకా ప్రతిపాదన దశలో ఉండగానే తెలంగాణా నుంచి బనకచర్లకు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వెల్లువెలుతున్నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హుటాహుటీన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జలవనరుల మంత్రిని కలసి బనకచర్లకు అనుమతులు ఇవ్వద్దని కోరారు.
ఈ రచ్చ ఇలా ఉండగానే హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబిల్ సమావేశంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కవిత మాట్లాడుతూ పోలవరానికే ఎసరు తెచ్చేలా అతి పెద్ద డిమాండ్ ని చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ని విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారని ఆ తరువాత 2014 లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఒక ఆర్డినెన్స్ ద్వారా తెలంగాణాకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఏపీకి అప్పగించిందని కవిత ఆరోపించారు.
అంతే కాకుండా 460 మెగావాట్ల లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టుని కూడా అప్పగించారని ఆమె విమర్శించారు. దీని మీద బీఆర్ ఎస్ పార్లమెంట్ లో గట్టిగా నిలదీసినా కూడా కేంద్రం పట్టించుకోలేదని ఆమె నిందించారు. అంతే కాదు కేసీఆర్ బంద్ కి పిలుపు ఇచ్చిన కూడా కేంద్రం అసలు ఏ మాత్రం స్పందించలేదని ఆమె మండిపడ్డారు.
ఇక పోలవరం ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని ఏకంగా 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కుల దాకా పెంచుకుంటూ పోయారని దాని వల్ల తెలంగాణాలోని పలు మండలాలు ముంపునకు గురు అవుతున్నాయని కవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలో మానవతా దృక్ష్పధంతో కేంద్రం జోక్యం చేసుకుని తెలంగాణా సమస్యకు పరిష్కారం చూపించాలని ఆమె కోరారు.
తెలంగాణాకు చెందిన పురుషోత్తమపట్నం, గుండాల, ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను వెనక్కి ఇవ్వాలని కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రగతి అజెండా పేరుతో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న సమావేశంలోనే ఆ అయిదు మండలాలను తెలంగాణాకు తిరిగి ఇస్తున్నట్లుగా ప్రధాని మోడీ ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఒక విధంగా ఇది పోలవరానికే ఎసరు పెట్టే డిమాండ్ గా ఉందని అంటున్నారు. కవిత కోరిక ఆ అయిదు గ్రామ పంచాయతీలు పోలవరం ప్రాజెక్టుకు ఎంతో కీలకమైనవిగా చెబుతున్నారు. పోలవరం విషయం తీసుకుంటే గత పదకొండేళ్ళుగా నత్తనడకగా సాగుతూ వస్తోంది. దాని ఎత్తుని ఒక వైపు తగ్గిస్తున్నారని ప్రచారం ఉంది. అలాంటి సమయంలో మరికొన్ని సాంకేతిక పరమైన చిక్కులు ఉన్నాయి. నిధుల సమస్య ఎటూ ఉంది.
ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణా అభ్యంతరాలు ఏమీ లేవు అంతా సర్దుకుంది అనుకుంటున నేపధ్యంలో కవిత ఈ కొత్త డిమాండ్ ని పెట్టారు. ఈ డిమాండ్ ని ఇపుడు తెలంగాణాలోని మిగిలిన పార్టీలు పట్టుకుంటే బనకచర్ల సంగతి పక్కన పెడితే పోలవరానికే ఎసరు వస్తుందా అన్న చర్చ సాగుతోంది.