
తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో రాజకీయంగా ప్రత్యర్థులుగా మాత్రమే ఉండే రాజకీయనాయకుల మధ్య ఇప్పుడు శత్రుత్వమే కాదు.. వ్యక్తిగత కక్షల వరకు పరిస్థితులు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్లే విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. లోకేశ్ షురూ చేసిన రెడ్ బుక్ రాజకీయం ఇప్పుడు అంతకంతకూ విస్తరిస్తోంది.
లోకేశ్ నోటి నుంచి తరచూ వచ్చే రెడ్ బుక్ పాలన.. తెలుగు రాజకీయాల్లో సరికొత్త ఆయుధంగా మారింది. దీనికున్న క్రేజ్ ను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ విపక్షం బీఆర్ఎస్ ముఖ్యనేతలు సైతం తాము పింక్ బుక్ రాస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. మొదట్లో మాట వరసకు అన్నట్లుగా భావించినా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. గులాబీ కీలక నేతల నోటి నుంచి తరచూ పింక్ బుక్ ప్రస్తావన రావటంతో.. తెలంగాణ రాజకీయాలు సైతం కలర్ బుక్ రాజకీయాల దిశగా అడుగులు పడుతున్నట్లుగా చెప్పాలి.
ఇంతకూ ఈ బుక్ లో ఏముంటుంది? నిజంగానే అందులో ఏం రాసుకుంటారు? అన్న సందేహాలకు తావు లేకుండా విపక్షంలో ఉన్నప్పుడు లోకేశ్ తన వెంట రెడ్ కలర్ అట్ట ఉన్న పుస్తకాన్ని తన వెంట తీసుకొచ్చి.. సభలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ పుస్తకాన్ని చూపించేవారు. నిజానికి లోకేశ్ ఇమేజ్ బిల్డింగ్ కు రెడ్ బుక్ కాన్సెప్టు కలిసి వచ్చిందని చెప్పాలి. ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్ర కంటే కూడా రెడ్ బుక్ పట్టుకొని.. ‘‘ప్రత్యర్థుల సంగతి తేలుస్తా.. అందులో అన్ని రాసుకుంటున్నా.. నా పార్టీకి చెందిన వారి ఇబ్బందుల్ని నమోదు చేసుకుంటా. అంతకంతకూ బదులు తీర్చుకుంటా’ అంటూ చెప్పిన మాటలు హైలెట్ అయ్యాయి.
లోకేశ్ రెడ్ బుక్ ఆయనకు కొత్త ఇమేజ్ తీసుకురావటమే కాదు.. నేతలు.. కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచేలా చేయటం మిగిలిన పార్టీలకు స్ఫూర్తిగా మారింది. అధికారం చేతిలో లేనప్పుడు అధికార పార్టీ తమను పెట్టే ఇబ్బందుల్ని మర్చిపోకుండా అన్ని రాసుకుంటున్నా.. గుర్తు పెట్టుకుంటున్నానన్న సందేశాన్ని క్యాడర్ కు.. కార్యకర్తలకు ఇవ్వటమే ఈ బుక్ కాన్సెప్టుగా చెప్పాలి.
ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని.. వారి బతుకుల్ని మారుస్తామని.. డెవలప్ మెంట్ దిశగా పరుగులు తీయిస్తామని.. ఉపాధి అవకాశాల్ని భారీగా పెంచేస్తామని.. రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసి.. ప్రజల మీద పన్నుపోటు లేకుండా చూస్తామన్న రాజకీయానికి బదులుగా.. ఎంతసేపటికి మీరు నన్ను.. నా పార్టీ నేతలు.. కార్యకర్తల్ని ఆ మాట అన్నారు. ఈ మాట అన్నారు. ఆ చర్య చేపట్టారు. ఈ పని చేశారు. ఇంతకింతా మీకు తిప్పలు తప్పవన్న హెచ్చరికలు రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలు మరింత దూకుడుగా చేపడతాయని చెప్పాలి.
ఇదంతా చూస్తే.. ఇప్పటికి మించి రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా ఏ పార్టీకి ఆ పార్టీ తమదైన ఒక బుక్ ను తమ రాజకీయ ప్రత్యర్థుల కోసం సిద్ధం చేసుకుంటుందని చెప్పాలి. అదే జరిగితే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రజల బాగు కోసం కంటే.. బదులు తీర్చుకోవటంపైనే ఎక్కువ ఫోకస్ చేయటం ఖాయం.