
AP DSC : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించి పచ్చజెండా ఊపింది. మొత్తం 16347 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో డీఎస్సీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వీడియో విడుదల చేశారు.
* చంద్రబాబు పుట్టినరోజు కానుకగా..
ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) పుట్టినరోజు కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఫైల్ గా సంతకం చేశారు. రకంగా 16 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అయితే మధ్యలో రకరకాల కారణాలతో జాప్యం జరిగింది. కానీ ఎట్టకేలకు అనుకున్న విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. నేటి నుంచి మే 15 వరకు ఆన్లైన్లో డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. జూన్ 6 నుంచి జూలై ఆరు వరకు సిబిటి విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కొనసాగుతాయి. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సమగ్ర వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
* డెమో వీడియో విడుదల..
అభ్యర్థులంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అప్లై చేసుకునేందుకు సంబంధించిన డెమో వీడియో ను మంత్రి లోకేష్ ( Minister Nara Lokesh ) విడుదల చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో మరో హామీ నిలబెట్టుకున్నామని లోకేష్ అన్నారు. డీఎస్సీ అభ్యర్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రైమరీ కీ విడుదల అయిన తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఫైనల్ కీ విడుదల కానుంది. అటు తరువాత మరో ఏడు రోజులకు మెరిట్ జాబితా ప్రకటిస్తారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల్లో.. జిల్లాస్థాయిలో 14088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లాస్థాయిలో నియామకాలు చేపడుతున్నారు. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు నారా లోకేష్.