
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఐదు రోజులుగా భీకర యుద్ధం అవిరామంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గగనతల దాడులు చేస్తుంటే.. ఆ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ సమయంలో.. అసలు ఇరాన్ క్షిపణులను రాత్రుల్లే ఎందుకు ప్రయోగిస్తోంది అనే చర్చ తెరపైకి వచ్చింది. దానికి కారణమూ తెలిసింది.
అవును… సుమారు ఐదు రోజులుగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో పశ్చిమాసియాలోని ప్రజానికం వణికిపోతున్నారు. ఈ క్రమంలో.. ఇరాన్ కూడా దూకుడు పెంచింది. ఇజ్రాయెల్ పై సెలక్టివ్ గా దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో.. ఇరాన్ రాత్రి వేళల్లోనే ఎక్కువగా క్షిపణి దాడులు ఎందుకు చేస్తుందనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనికి ఓ సాంకేతిక కారణం ఉందంట.
వాస్తవానికి ప్రత్యర్థిపై పగలు దాడి చేశామా, రాత్రులు దాడి చేశామా అనేది పెద్ద విషయం కాదు! కాకపోతే.. నిశిరాత్రి దాడి చేయడం వెనుక కొన్ని మానసిక యుద్ధతంత్రం వంటివి ఉన్నాయని అంటారు. ఇందులో భాగంగా… ఇజ్రాయెల్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేయడం ఇందులో ఒకటి కావొచ్చు. అయితే.. రాత్రి వేళల్లోనే క్షిపణి దాడులు చేయడం వెనుక ఇరాన్ కష్టాలు ఇరాన్ కి ఉన్నాయని అంటున్నారు.
ఇందులో భాగంగా.. ఇరాన్ వద్ద ఉన్న క్షిపణుల్లో 2,000 కిలోమీటర్లకు పైబడి రేంజి ఉన్నవి మాత్రమే ఇజ్రాయెల్ లోని లక్ష్యాలను చేరుకోగలవని చెబుతున్నారు. అయితే.. ఇవి యుద్ధ విమానాల లాగా వాతావరణం నుంచి ఆక్సిజన్ ను ప్రొపెల్షన్ లోకి తీసుకోవు. ఈ నేపథ్యంలో కంబస్టన్ కోసం కచ్చితంగా ఇంధనం, ఆక్సిడైజర్ ఉండి తీరాల్సిందే.
దీంతో… ద్రవ ఇంధనంతో పనిచేసేవి, ఘన ఇంధనంతో పనిచేసేవి ఉంటాయి. ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న దీర్ఘశ్రేణి “షబాబ్” క్షిపణుల్లో ద్రవ ఇందనాన్ని వినియోగిస్తున్నారు. వీటిని ప్రయోచించడానికి మిస్సైల్ లో ఇంధనం నింపడం ఓ పెద్ద పరీక్ష. ఇందులో భాగంగా ఆ క్షిపణి లోని రెండు వేర్వేరు ట్యాంకులలో ఇంధనం, ఆక్సిడైజర్ లను నింపాలి.
దీనికి కాస్త ఎక్కువ సమయం పట్టడంతోపాటు.. ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. దీనికి ఒకే చోట ఉండే లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదనపు సిబ్బంది అవసరం. ఈ సమయంలో.. శత్రువు ఉపగ్రహాలు, నిఘా విమానాలు ఈ క్షిపణికి పసిగట్టే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళల్లోనే ఈ ప్రక్రియను చేపడతారని చెబుతున్నారు.
ఇక ద్రవ ఇందనం నింపే ఫతేహ్-110 వంటి క్షిపణుల్లో ఆక్సిడైజర్ కలిసే ఉంటుంది. అందువల్ల దీన్ని ఎప్పుడంటే అప్పుడు ఉపయోగించవచ్చు. అందువల్లే… ఇరాన్ ద్రవ, ఘన ఇంధన క్షిపణులు కలిపి వాడుతోంది. తమ ప్లాట్ ఫామ్ లు, ట్రక్కులు వెంటనే శత్రువు కంటపడకుండా కాపాడుకొంటూ.. ప్రత్యర్థులను దెబ్బతీసి భయపెట్టేలా వ్యూహాలు రచిస్తోంది.
మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న పాతతరం యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ కు చేరాలంటే.. ఇరాక్, సిరియా, సౌదీ, జోర్డాన్, లెబనాన్ మొదలైన దేశాల్లోని కొన్నింటి గగనతలం పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ పై దాడికి తమ గగనతలాన్ని ఉపయోగించుకుంటామంటే ఆ దేశాలు అనుమతించే అవకాశం లేదు! దీంతో.. ఆ క్షిపణులనే నమ్ముకుని చీకట్లో యుద్ధం చేస్తోంది ఇరాన్!
కాగా.. ఇరాన్ వద్ద ఇజ్రాయెల్ దగ్గరున్నటువంటి అత్యాధునిక విమానాలు లేవనే సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ సాంకేతికంగా చాలా అప్ డెటెడ్ అవ్వడంతో పాటు అమెరికాలాంటి మిత్రుడ్ని కలిగి ఉంది. అయితే.. ఇరాన్ వద్ద ఎప్పుడో అమెరికా, సోవియట్ రష్యా పాత విమానాలే ఉన్నాయి. అందుకే.. ఇరాన్ పూర్తిగా క్షిపణులపై ఆధారపడుతోంది! చీకట్లో దాడులు చేస్తోంది!