
హైదరాబాద్, మే 29, 2025: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం గురించి అందరికీ తెలిసిందే. సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్లలో తినుబండారాల ధరలు, నాణ్యతపై పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వస్తువులు ఎంత ధరకు విక్రయిస్తున్నారు? వాటి నాణ్యత ఎలా ఉంది? అనే అంశాలను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ధరలు తగ్గితే థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం విలువైన సూచనలు అందించినందుకు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ కార్యకలాపాలను మెరుగుపరచడం, ప్రేక్షకుల అనుభవాన్ని సుసంపన్నం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా దిల్ రాజు ఒక ప్రత్యేక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు.
“సామాన్య సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి ఆకర్షించే విషయంలో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు నేను పూర్తిగా మద్దతు పలుకుతున్నాను. సినిమా హాళ్లలో తినుబండారాలు మరియు పానీయాల ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలన్న వారి సూచన అభినందనీయం. ఈ చొరవను మనమంతా స్వాగతించి, కలిసి ముందుకు సాగుదాం,” అని దిల్ రాజు పిలుపునిచ్చారు.
“సినిమాలు థియేటర్ల నుంచి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు త్వరగా వెళుతుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే, ఒక సినిమా ఎంత కాలం థియేటర్లో ఉండి, ఎప్పుడు ఓటీటీకి వెళ్లాలనే విషయంపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెండితెరపై సినిమా చూసే అనుభవాన్ని ప్రేక్షకులకు అర్థవంతంగా అందించడం మనందరి బాధ్యత,” అని ఆయన అన్నారు.
“ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా, ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలన్న పవన్ కళ్యాణ్ సూచన పరిశ్రమకు శాశ్వత దిశానిర్దేశం చేస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమ రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేయాలి. ఈ దిశగా కీలక అడుగులు వేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు,” అని దిల్ రాజు తెలిపారు.
“థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి పైరసీ ఒక ప్రధాన కారణం. మనమంతా కలిసి పైరసీని ఎదుర్కొంటేనే ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఆకర్షించగలం. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి, తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి చురుకుగా తోడ్పడుతుంది,” అని దిల్ రాజు పేర్కొన్నారు.