
హైదరాబాద్: రష్యాకు చైనా ఆయుధాలు, మందుగుండు సామగ్రి సమకూరుస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణలు చేశారు. వీటిని చైనా తోసిపుచ్చింది. యుద్ధం ముగియాలని తాము బలంగా కోరుకుంటున్నామని, త్వరగా శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చైనా వైఖరి స్పష్టంగా ఉందన్నారు. నిరాధార, రాజకీయ ఉద్దేశాలను వ్యతిరేకిస్తున్నామని, రష్యా దిగుమతి చేసుకుంటున్న ఆయుధాల్లో ఎక్కువగా అమెరికా, పాశ్చాత్య దేశాలవేనని ఉక్రెయిన్ బహిరంగంగా చెప్పిందన్నారు. తాము ఎవరికీ మారణాయుధాలను సరఫరా చేయలేదన్నారు. యుద్ధం ముగియాలని కోరుకుంటున్నామని, కాల్పుల విరమణను ప్రోత్సహించడంతోపాటు శాంతి చర్చలకు సహకారం అందించేందుకు చైనా కట్టుబడి ఉందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు.