
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది.ఆంధ్రప్రదేశ్ లో రానున్న నాలుగు రోజుల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని కూడా హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది. భారీ వర్షాలు పడితే కొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశముందని తెలిపింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అవసరమైన సమయంలో ఇళ్ల నుంచి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
పగటి పూట ఉష్ణోగ్రతలు…
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని చెప్పింది. దీంతో పాటు ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈదురుగాలులు గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో ఏపీలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. మరింతగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోనూ భారీ వర్షాలు…
తెలంగాణలోనూ భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోనూ యాభై నుంచి అరవై కిలోమీటర్ల మేరకు గంటకు బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా అనేక జిల్లాల్లో వర్షాలు పడతాయని, రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ధాన్యం తడిసిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా భారీగా నమోదవుతాయని తెలిపింది.