
అగ్రరాజ్యం అమెరికా.. బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధంతో మేలు ఎవరికి? కీడు ఎవరికి? అన్నదిప్పుడు చర్చగా మారుతోంది. ఈ సందర్భంగా కౌంటర్ పాయింట్ సంస్థ తన రీసెర్చ్ రిపోర్టును బయటపెట్టింది. అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్దం కారణంగా అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ ట్యాప్ లను ఉత్పత్తి చేసే సంస్థలు తమ ఉత్పత్తి కర్మాగారాలను చైనా నుంచి భారత్ కు తరలించే అంశాల్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకుంటున్నాయి.
అలా అని భారతదేశమే పూర్తిగా లాభపడుతుందని బావించటం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. భారత్ కంటే కూడా మరికొన్ని దేశాలపై మొబైల్.. ల్యాప్ టాప్.. కంప్యూటర్ల తయారీ సంస్థలు భావిస్తున్నాయి. ప్రతీకార లారిఫ్ ఉద్రికత్తలు దీర్ఘకాలం సాగితే.. రానున్న రోజుల్లో పరిణామాలు వేగంగా మారనున్నాయి. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో చైనా దేశ వాటానే మెజార్టీ. కానీ.. ఇప్పుడున్న పరిస్థితులు కొనసాగితే ఈ దేశ వాటా 2026 నాటికి 55 శాతానికి పడిపోనుంది. 2024లో దీని వాటా 64 శాతం ఉండటం గమనార్హం.
అమెరికాకు చెందిన యాపిల్.. కొరియాకు చెందిన శాంసంగ్ తమ ఉత్పత్తుల్ని భారత్ కు కేంద్రంగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ల మొత్తం ఉత్పత్తిలో భారత్ వాటా 2026 నాటికి 25-28 శాతానికి చేరుకుంటుందని చెబుతున్నారు. 2024 నాటికి మన దేశ వాటా 18 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా ఐఫోన్ల ఉత్పత్తి విలువలో భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుతం 20 శాతంగా ఉంది. 2025-26 నాటికి 25 శాతానికి.. 2026-27 నాటికి 35 శాతానికి చేరుకుంటుందని తాజా రిపోర్టు అంచనా వేస్తోంది.
ల్యాప్ టాప్.. పీసీల మొత్తంతయారీలో చైనా వాటా 2026 నాటికి 68-70 శాతానికి దిగి వస్తుందని చెబుతున్నారు. 2024 నాటికి ఈ వాటా 75 శాతం ఉండేది. అదే సమయంలో ఈ రంగంలో భారత్ ఉత్పత్తి వాటా 2026 నాటికి 7 శాతం ఉండొచ్చు. 2024లో ఇది 4 శాతంగా ఉంది. ల్యాప్ టాప్ లు.. కంప్యూటర్లు చైనా నుంచే అధికంగా దిగుమతి అవుతున్నాయి. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో హెచ్ పీ.. డెల్ లాంటి సంస్థలు తమ ఉత్పత్తి స్థావరాల్ని చైనా నుంచి భారత్ కు మారిస్తే మన వాటా పెరగనుంది. అయితే.. చైనా నుంచి తయారీ కర్మాగారాల్ని భారత్ కు తరలించటం అంత సులువైన అంశం కాదు.
డెల్ సంస్థ ల్యాప్ టాప్ ఉత్పత్తి 79 శాతం చైనాలో ఉండగా.. మిగిలినదంతా వియత్నాంలో ఉంది. 2026 నాటికి డెల్ తన తయారీ సామర్థ్యాన్ని సగానికి పైగా వియత్నాంకు తరలించనుంది. లెనివో సైతం వియత్నాంను ప్రత్యమ్నాయ దేశంగా చూస్తోంది. చైనాలో 85 శాతం తయారీ సామర్థ్యం ఉన్న హెచ్ పీ.. 2026లో మెక్సికో.. తైవాన్ దేశాలకు 45 శాతం మార్చనుంది. మొత్తంగా వాణిజ్య యుద్ధంలో భారత్ కు మేలు జరిగేది అంతంతేనని మాత్రం చెప్పక తప్పదు.