
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే యువతకు ఊహించని రీతిలో ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కంచిపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి జర్మనీలో అనారోగ్యంతో మృతి చెందింది. బయో మెడికల్ మాస్టర్స్ చదువుతున్న ఆమె బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతూ అక్కడే తుదిశ్వాస విడిచింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. కంచిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు షేక్ మహబూబ్ బాషా పెద్ద కుమార్తె షేక్ రెహానా బేగం (28) ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లింది. బయో మెడికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసేందుకు 2022లో జర్మనీలోని హాల్ పట్టణంలో చేరింది. కొద్ది కాలానికే ఆమె అనారోగ్యానికి గురైంది. వైద్య పరీక్షల్లో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సుమారు 22 నెలల పాటు అక్కడ చికిత్స పొందినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఈనెల 21వ తేదీన రెహానా బేగం కన్నుమూసింది.
రెహానా మృతదేహాన్ని జర్మనీ నుంచి స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు చేశారు. ఆమె భౌతికకాయం ఆదివారం హైదరాబాద్కు చేరుకుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచిపల్లికి తీసుకొచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఉన్నత చదువులకని ఆశతో విదేశాలకు వెళ్లిన యువతి విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శోకసముద్రంలో మునిగిపోయారు. రెహానా మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.