
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన తీరుపై ఆ దేశ ప్రజలు మరోసారి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని పలు నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఈ నిరసనలు ఎక్కువగా కనిపించాయి. న్యూయార్క్‌లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు, ట్రంప్ పాలనను వ్యతిరేకిస్తూ గళమెత్తారు. ‘అమెరికాలో రాజులు ఎవరూ లేరు’, ‘ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి’ వంటి నినాదాలతో తమ నిరసన తెలిపారు. ముఖ్యంగా, తాత్కాలిక వలసదారులకు కల్పించిన చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రభుత్వ నిర్ణయాలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎలాంటి భయం లేదు.. వలసదారులకు స్వాగతం’ అంటూ వలసదారులకు మద్దతుగా నినాదాలు చేశారు.