
భారత సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన జవాన్ పూర్ణం సాహూ అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అతడి విడుదల కోసం భారత ప్రభుత్వం దాయాది దేశంతో చర్చలు జరుపుతుండగా, తమ కుమారుడి క్షేమ సమాచారం తెలియక ఆ జవాన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తమ బిడ్డను ఎలాగైనా సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జవాన్ తండ్రి భోల్‌నాథ్ సాహూ తన బాధను వ్యక్తం చేస్తూ, “అతను దేశం కోసం సేవ చేస్తున్నాడు. సెలవు ముగించుకుని మూడు వారాల క్రితమే తిరిగి విధుల్లో చేరాడు. ఇప్పుడు పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాడని అధికారులు సమాచారం అందించారు. మా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. అతను క్షేమంగా ఉన్నాడా? అసలు బతికున్నాడా లేదా? అక్కడ ఏమి జరుగుతోంది? అతను ఎప్పుడు తిరిగి ఇంటికి వస్తాడు?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్ణం సాహూ భార్య కన్నీరు పెట్టుకుంటూ.. “మంగళవారం రాత్రి నాకు ఫోన్ చేశారు. అదే ఆయన గొంతు వినడం చివరిసారి. మళ్లీ ఫోన్ చేస్తే కలవలేదు. బుధవారం రాత్రి ఆయన స్నేహితుడొకరు కాల్ చేసి జరిగిన విషయం చెప్పారు. అప్పటి నుంచి మేమంతా ఏడుస్తూనే ఉన్నాం. నా ఏడేళ్ల కుమారుడు ‘నాన్నకు ఏమైంది?’ అని అడుగుతున్నాడు. నా బిడ్డకు ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు” అని తన గోడు వెళ్లబోసుకుంది.
బీఎస్ఎఫ్ 182వ బెటాలియన్‌కు చెందిన పూర్ణం సాహూ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు భద్రతగా గస్తీ తిరుగుతుండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దగ్గరలో ఉన్న ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా, అది పాకిస్తాన్ భూభాగమని ఆయన గుర్తించలేకపోయారు. సరిహద్దు దాటడంతో పాకిస్తాన్ రేంజర్స్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సాహూ విడుదల కోసం ఇరు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. ఈ విషయాన్ని గురువారం రాత్రి అధికారులు ధ్రువీకరించారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితిపై స్పష్టత లేదు.