మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మే ఆరు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిపి మద్యం స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య మూడుకు చేరింది. కోర్టు ఆదేశాలతో సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మద్యం కుంభకోణం కేసులో ఏసీఎస్గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని నిన్న హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారు. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ సుదీర్ఘంగా సాగింది. 2019లో వైసీపీ అధికారం చేపట్టాక, నూతన మద్యం విధానం రూపకల్పనలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. సజ్జల శ్రీధర్ రెడ్డికి చెందిన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు గత ప్రభుత్వంలో మద్యం తయారీకి సంబంధించి ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు సిట్ గుర్తించింది. ఎస్పీవై ఆగ్రోలో ఏ ఏ బ్రాండ్లకు సంబంధించి మద్యం తయారు చేశారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఎలా సరఫరా చేశారో సిట్ అధికారులు సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో దాదాపు 3000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని భావిస్తున్న సిట్, ఆ నగదు ఎవరికి, ఎలా వెళ్లిందనే విషయంపై సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి ఆరా తీసినట్లు తెలుస్తోంది. సజ్జల శ్రీధర్ రెడ్డి నుంచి సమాచారం సేకరించిన తర్వాత, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. వాదనల వెనుక కోర్టు రిమాండ్ విధించింది.
