సమర్థ అధ్యక్షుడి ఎంపిక కోసం కసరత్తు పార్టీ,ప్రభుత్వంలో
మార్పులు అంటూ ప్రచారం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18 : బిజెపి తదుపరి అధ్యక్షుడి ఎంపికపై బిజెపి ఇంకా స్పష్టత ఇవ్వకున్నా.. సమర్థ నేత అన్వేషణలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన, బలహీనవర్గాలకు చెందిన నాయకుడిని ఎంపికచేసే పనిలో ఉన్నట్లు దేశ రాజధానిలో వార్తలు ప్రచారం అవుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడితో పాటు, పలు రాష్ట్రాల అధ్యక్షులను నియమించాల్సి ఉంది. సామాజజిక సమీకరణాలు కూడా ముఖ్యమే. అన్నింటికీ మించి ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉన్న సమర్థ నేత కూడా అవసరమే. ఈ క్రమంలో గతంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు బలంగా వినిపించింది. మధ్యప్రదేశ్ సిఎంగా బలమైన ముద్ర వేసారు. ఇప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఆయనపట్ల ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఇదంతా ఒక ఎత్తయితే దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మోడీ సందర్శించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ క్రమంలో త్వరలో భారతీయ జనతా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక మార్పులు జరగనున్నట్లు రాజకీయ ప్రచారం సాగుతోంది. మరో వారం పది రోజుల్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీపై పూర్తిగా పట్టుబిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశర చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య చర్చ సాగిందన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే బలమైన నేత అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హరియాణా సహా పలు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను కూడా నియమించాల్సి ఉంది. పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులుగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ప్రధాని మోదీ పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నవారికి అవకాశం కల్పించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ యువనేతలకు కూడా కీలక ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిసింది. నాలుగైదు రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా మార్చే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు హోంమంత్రి అమిత్ షా కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో చర్చలు జరిపారు. మోదీ కూడా వీరితో మంతనాలు జరిపినట్లు సమాచారం. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను కేంద్రంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన దక్షిణాదిలో,ముఖ్యంగా తమిళనాడులో ప్రభావంచూపే నేతగా ఎదిగారు. అన్నాడిఎంకే బీజేపీ జతకట్టడంతో ఆయన తమిళనాడు అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అన్నామలైను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
