
ఇటీవల కాలంలో చాలామంది మగవారిని తీవ్రంగా ఇబ్బందిపెట్టే, దాచుకోలేని సమస్యల్లో బట్టతలి ఒకటి అని చెప్పుకోవచ్చు. నలభై ఏళ్లు దాటిన తర్వాత వస్తే కాస్త లైట్ తీసుకోవచ్చేమో కానీ.. మరీ పాతికేళ్లు నిండకుండానే పల్చబడిపోవడం, ముప్పైలోకి వస్తే దువ్వెన అవసరం లేకుండాపోతోన్న పరిస్థితి. ఈ సమయంలో ఈ సమస్య పరిష్కారాన్ని చూపి చాలా మంది ప్రజలను మోసం చేస్తున్నారు.
వాస్తవానికి బట్టతల రావడానికి జన్యుపరమైన సమస్యలు ఒక కారణమైనప్పటికీ.. ఒత్తిడి, కొన్ని అలవాట్లు కూడా ప్రధాన కారణంగా మారుతున్నాయని అంటున్నారు. పైగా ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారితో పోలిస్తే.. తక్కువ ఒత్తిడికి గురయ్యే వారిలో బట్టతల వచ్చే సమస్య 2.6 రెట్లు తక్కువని ఆర్కెవ్స్ ఆఫ్ డెర్మటాలజీ జర్నల్ లో నివేదిక చెబుతున్న పరిస్థితి.
ఆ సంగతి అలా ఉంటే… బట్టతల వచ్చిన ప్రతీ ఒక్కరూ ట్రాన్స్ ప్లెంటేషన్ చేయించుకోలేని పరిస్థితి! ఈ నేపథ్యంలో వీరి బలహీనతను క్యాష్ చేసుకుంటూ రకరకాల నూనెలు, ఔషదాలు అని ప్రకటనలు కనిపిస్తుంటాయి. ఇలానే తాజాగా హైదరాబాద్ లో ఒకరు దుకాణం తెరవగా.. విషయం తెలుసుకొన్న ఉప్పల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు.
అవును… ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగయత్ లో ఓ ముగ్గురు వ్యక్తులు దుకాణం తెరిచారు. బట్టతలకు మందు ఇస్తామని చెబుతూ ఓ శిబిరం ఏర్పాటు చేశారు. దీంతో… ఇప్పటికే ఆ సమస్యతో బాదపడుతున్న వారు ఆ శిబిరం ముందు క్యూ కట్టారు. ఒకేసారి వందలమంది బట్టతల బాధితులతో ఆ శిబిరం నిండిపోయింది.
ఈ సమయంలో… ఒక్కో బాధితుని నుంచి రూ.1000 కలెక్ట్ చేశారు నిర్వాహకులు. ఇందులో భాగంగా… ఎంట్రీ ఫీజు రూ.300 కాగా రూ.700 ఆయిల్ బాటిల్ ధరగా నిర్ణయించారు. ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు బట్టతల ఆయిల్ ఇస్తామంటూ మోసానికి పాల్పడుతున్నారంటూ హరీష్, రాజశేఖర్, వినోద్ లను అదుపులోకి తీసుకున్నారు.