
పహల్గాం సంఘటనల నేపథ్యంలో భారత నౌకాదళం తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. దేశ భద్రతా సామర్థ్యాలను పెంపొందించుకుంటూ, యుద్ధ సన్నద్ధతను చాటుతోంది. ఇటీవలే ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి విజయవంతంగా పరీక్షించిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ క్షిపణి, సముద్రతలానికి సమీపంలో దూసుకొస్తున్న లక్ష్యాన్ని ఛేదించడం భారతీయ నేవీ సామర్థ్యాలకు నిదర్శనం. ఈ క్షిపణులు యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను సమర్థంగా నేలకూల్చగలవు. అంతేకాకుండా, అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను కూడా నేవీ తాజాగా పరీక్షించింది.
– శక్తిమంతమైన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (సీబీజీ)
భారత నౌకాదళం యొక్క కీలక బలం దాని విమానవాహక నౌకలు. ముఖ్యంగా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అధునాతన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు పాకిస్థాన్‌లో గుబులు పుట్టిస్తోంది. విమానవాహక నౌకలు ఒంటరిగా కాకుండా, జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధనౌకలతో కూడిన శక్తిమంతమైన క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (సీబీజీ)తో కలిసి సంచరిస్తాయి. ఈ బృందం సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఉపయోగపడుతుంది. కర్ణాటకలోని కార్వార్ నౌకాస్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్‌లోకి విక్రాంత్ చేరడం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం.
విక్రాంత్ సుమారు 40 యుద్ధవిమానాలు, హెలికాప్టర్లను (మిగ్-29కె ఫైటర్ జెట్లు, కామోవ్-31 వంటివి) మోహరించగలదు. 64 బరాక్ క్షిపణులు, శక్తిమంతమైన బ్రహ్మోస్ క్రూజ్ క్షిపణులు, ఒటోబ్రెడా 76 ఎంఎం గన్స్, ఏకే-630 క్లోజిన్ ఆయుధ వ్యవస్థలు, ఆధునిక సెన్సర్లు దీని సొంతం. శత్రు వైమానిక, క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీనికి ఉంది.
పాక్‌కు “సాగర దిగ్బంధం” ముప్పు
ఐఎన్ఎస్ విక్రాంత్ కదలికలను బట్టి, పాకిస్థాన్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్‌ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాక్ వాణిజ్యంలో 60 శాతానికి పైగా, అలాగే చమురు అవసరాల్లో 85 శాతం సముద్ర మార్గంలో ఈ రేవుల నుంచే జరుగుతుంది. ఈ రేవులను దిగ్బంధిస్తే, పాక్‌కు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడి, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలోని సుమారు మూడోవంతు విద్యుదుత్పత్తి కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.విక్రాంత్ కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా, తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌పై కూడా దృష్టిపెట్టగలదని చెబుతున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఒకవేళ యుద్ధం అనివార్యమైతే, విక్రాంత్ తన క్యారియర్ గ్రూప్‌తో కలిసి వాయు, ఉపరితల, సముద్రగర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్‌పై ఉండే మిగ్-29కె ఫైటర్ జెట్లు 850 కిలోమీటర్ల వరకూ ప్రయాణించి, పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను, అలాగే పోర్టుల్లోని మౌలిక వసతులు, ఇంధన నిల్వలను లక్ష్యంగా చేసుకోగలవు.
-భారత నౌకాదళం ముందు వెలవెలబోతున్న పాక్ నేవీ
భారత నౌకాదళ బలం ముందు పాక్ నేవీ చాలా బలహీనంగా ఉంది. భారత్ వద్ద శక్తిమంతమైన విమానవాహక నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా, పాక్ వద్ద ఇలాంటివి లేవు. పాక్ ప్రధానంగా చైనా నుంచి సమకూర్చుకున్న వార్‌షిప్‌లపై ఆధారపడి ఉంది. ఆధునీకరణ కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు 2028 నాటికి గానీ అందే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, భారత నౌకా దిగ్బంధం వంటి “ఉచ్చు”ను తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి ప్రస్తుతం లేదని స్పష్టమవుతోంది.
– 1971 యుద్ధంలో విక్రాంత్ పాత్ర – చారిత్రక విజయాలు
ప్రస్తుత విక్రాంత్‌కు పూర్వం, 1971 నాటి భారత్-పాక్ యుద్ధంలో ఇదే పేరుతో ఉన్న విమానవాహక నౌక కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్థాన్ (నేటి బంగ్లాదేశ్)లోని చిట్టగాంగ్, కాక్స్ బజార్, ఖుల్నా వంటి నగరాలపై దాడి చేయడంలో, పాక్ నౌకాదళాన్ని బలహీనపరచడంలో, తూర్పు పాకిస్థాన్‌కు సరఫరాలను అడ్డుకోవడంలో ఇది సాయపడింది. 1971 యుద్ధంలో పాకిస్థాన్ నేవీ, అప్పటి భారత నౌకాదళానికి వెన్నెముకగా ఉన్న విక్రాంత్‌ను ముంచేయడానికి పీఎన్ఎస్ ఘాజీ అనే శక్తిమంతమైన జలాంతర్గామిని రంగంలోకి దించింది. అయితే, భారత నేవీ వ్యూహాత్మకంగా ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌ను విశాఖపట్నం వద్ద మోహరించి, నకిలీ కమ్యూనికేషన్లతో దాన్ని విక్రాంత్‌గా పాక్‌ను ఏమార్చింది. విక్రాంత్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించింది. రాజ్‌పుత్‌ను విక్రాంత్‌గా పొరబడి దగ్గరకు వచ్చిన ఘాజీని భారత యుద్ధనౌక ధ్వంసం చేసింది. ఇది పాక్ నౌకాదళానికి భారీ ఎదురుదెబ్బ.
అంతేకాకుండా, 1971 డిసెంబరు 4న భారత నౌకాదళం చేపట్టిన సాహసోపేత ‘ఆపరేషన్ ట్రైడెంట్’లో, ‘కిల్లర్ స్క్వాడ్రన్’లోని క్షిపణి నౌకలు కరాచీ రేవుపై దాడి చేసి పీఎన్ఎస్ ముహాఫిజ్, పీఎన్ఎస్ ఖైబర్ వంటి పాక్ యుద్ధనౌకలను, మందుగుండు సామగ్రిని తీసుకెళుతున్న ఎంవీ వీనస్ నౌకను ముంచేశాయి. కరాచీ రేవులోని చమురు ట్యాంకులూ పేలిపోయాయి. నాలుగు రోజుల తర్వాత ‘ఆపరేషన్ పైథాన్’ పేరిట మరోసారి కరాచీపై దాడి చేసి, పాక్ నేవీ ఇంధన ట్యాంకర్ పీఎన్ఎస్ ఢాకాను దెబ్బతీశాయి. ఈ దాడుల్లో కరాచీ ఇంధన నిల్వల్లో సగానికి పైగా నాశనమయ్యాయి. 1971 యుద్ధంలో నౌకాదళం విజయాలు భారత గెలుపులో కీలక పాత్ర పోషించాయి.
నేడు భారత నౌకాదళం మరింత బలోపేతం కావడంతో, ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి శక్తివంతమైన ఆస్తులతో సముద్రంలో పూర్తి ఆధిపత్యం సాధించే సన్నద్ధతను ప్రదర్శిస్తోంది. ఇది పాకిస్థాన్‌కు ఒక కష్టతరమైన సవాల్‌గా, ‘సాగర దిగ్బంధం’ రూపంలో ఒక వ్యూహాత్మక ‘ఉచ్చు’గా పరిణమించే అవకాశం ఉంది.