
దక్షిణ భారత దేశంలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుసగా నాలుగో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంటవెంటనే సెలవులు రావడంతో పాటు, వివిధ పరీక్షల ఫలితాలు వెలువడటంతో భక్తులు పెద్ద ఎత్తున తమ మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చి చేరుతున్నారు. దీనికి తోడు పలు విద్యాసంస్థలు ముందస్తుగా వేసవి సెలవులు కావడంతో.. కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం ఉదయానికి తిరుమలలోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
దీంతో స్వామి వారి సర్వదర్శనానికి.. దాదాపు 8 గంటల సమయం పడుతుంది టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే సోమవారం రాత్రి వరకు శ్రీవారిని 72,931 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో తిరుమల శ్రీవారి 4.79 కోట్ల హుండీ ఆదాయం వచ్చి చేరింది. అయితే రోజుకు రోజుకు భక్తుల రద్దీ పెరగడంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు భక్తులకు సరిపడా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి కావడంతో తిరుమలకు వచ్చే భక్తులు అనారోగ్యం పాలవకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కీలక ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులను సైతం ఏర్పాటు చేస్తున్నారు.