
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ పై అత్యంత తీవ్రంగా విరుచుకుపడుతున్నారు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఈ క్రమంలో తాజాగా పాకిస్థాన్ వైఖరి, ట్రంప్ వ్యవహార శైలిపై తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ మేరకు రజత్ శర్మా హోస్ట్ గా వ్యవహరించిన ఐకానిక్ షో ‘ఆప్ కీ అదాలత్’లో ఒవైసీ పాల్గొన్నారు.
అవును… హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించే వరకూ ఆపరేషన్ సింధూర్ కొనసాగాలని అన్నారు. పాకిస్థాన్ మరోసారి ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్ పైనా ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా… ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తలచుకుంటే పాక్ లోని 9 వైమానిక స్థావరాలపై దాడి చేసేదని.. కానీ అలా చేయకుండా కేవలం రన్ వేలను మాత్రమే ధ్వంసం చేసిందని చెప్పిన ఒవైసీ.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని పాక్ గ్రహించాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్ తో భారత్ దెబ్బకు పాక్ అల్లాడిపోయి కాళ్ల బేరానికి వచ్చిందని తెలిపారు.
ఇదే సమయంలో.. పాకిస్థాన్ ఎప్పుడూ అబద్ధాలనే నమ్ముకుందని, నిజాలు చెప్పదని చెప్పిన ఒవైసీ… పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. ఆపరేషన్ సింధూర్ పై ఫేక్ ఫోటోలు చూపించి ఆ దేశ ప్రధానినే మాయ చేశారని తెలిపారు. భవిష్యత్తులో భారత్ పై ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇదే క్రమంలో.. ట్రంప్ పైనా విరుచుకుపడ్డారు ఒవైసీ. ఇందులో భాగంగా… ట్రంప్ కు పెద్దగా జ్ఞానం లేదని తాను అనుకుంటున్నాను అని చెప్పిన ఒవైసీ.. మన ప్రధానమంత్రి ఆయనతో అరగంట సేపు మాట్లాడారని.. అయినప్పటికీ వాణిజ్య ఒప్పందాలను అందించడం ద్వారా యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పేర్కొన్నారని.. ఇది వాస్తవానికి దూరంగా ఉందని అన్నారు.
ఇదే సమయంలో… ట్రంప్ మన యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటే, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులను ఎందుకు ఆపడం లేదు? అని ప్రశ్నించారు అసదుద్దీన్ ఒవైసీ. అతనికి అధికారం ఉంటే.. ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధాన్ని, రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని కోరారు.